మంత్రిపదవి ఇస్తరా.. ఇవ్వరా మీ ఇష్టం: రాజగోపాల్‌రెడ్డి | Congress Leader Komatireddy Rajagopal Reddy On Ministerial position | Sakshi
Sakshi News home page

మంత్రిపదవి ఇస్తరా.. ఇవ్వరా మీ ఇష్టం: రాజగోపాల్‌రెడ్డి

Aug 6 2025 6:16 AM | Updated on Aug 6 2025 6:16 AM

Congress Leader Komatireddy Rajagopal Reddy On Ministerial position

పదవి కోసం కాళ్లు పట్టుకొని బతిమిలాడే రకం కాదు నేను

అవసరమైతే మళ్లీ త్యాగం చేస్తా 

నిన్నమొన్న వచ్చిన జూనియర్లకు పదవులు ఇచ్చారన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

సంస్థాన్‌ నారాయణ పురం: ‘ప్రజల మధ్యనే ఉంటా.. ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచు కుంటా.. వారి కోసం ఎంత దూరమైనా పోతా.. అవసరమైతే మళ్లీ త్యాగం చేస్తా’ అని మును గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలంలోని లచ్చమ్మగూడెం, చిమిర్యాల గ్రామాల్లో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి మంగళవారం విద్యుత్‌ సబ్‌సేష్టన్‌లను ప్రారంభించారు. అనంతరం రాజగోపాల్‌రెడ్డి మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. ‘నేను మాట్లాడితే మంత్రిపదవి రాలేదు కాబట్టే మాట్లాడుతున్నానని కొందరు ఆరోపిస్తున్నారు. 

మంత్రిపదవి కావాలనుకుంటే నేను ఎల్బీనగర్‌ నుంచి పోటీ చేసేవాడిని. మునుగోడు నియోజకవర్గ ప్రజల అభివద్ధి కోసమే నేను ఇక్కడి నుంచి పోటీచేశాను. పదవుల వెనకాల పాకులాడాల్సిన అవసరం నాకు లేదు. అదష్టం ఉండి నాకు పెద్ద పదవి వస్తే ..అది మునుగోడు నియోజకవర్గ ప్రజలకు మేలు జరుగుతుంది. పైరవీలకు పోయి, దోచుకొనేటోడిని కాను. రాజకీయాలు అడ్డం పెట్టుకొని వచ్చి రూ.వేల కోట్లు దోచుకునే వారికి పదవులు కావాలి. 

రాజగోపాల్‌రెడ్డికి ప్రజలు కావాలి..వారి అభివద్ధి, సంక్షేమం కావాలి. ప్రజల కోసం పార్టీ మారి కాంగ్రెస్‌లోకి వచ్చిన. మీరు మంత్రిపదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇస్తారా.. ఇవ్వరా మీ ఇష్టం, నేను సీనియర్‌ను కాబట్టి..తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను. ఇతర పార్టీల నుంచి నిన్న మొన్న వచ్చిన జూనియర్లకు పదవులు ఇచ్చారు. మీరు ఎంపీని గెలిపించమంటే గెలిపించాను. పార్టీలోకి రమ్మంటే, పార్టీని నమ్ముకొని వచ్చినా. 

మీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి, ఇస్తారా ఇవ్వరా మీ ఇష్టం. నేను మాత్రం పదవుల కోసం ఇంటికి వెళ్లి కాళ్లు మొక్కి బతిమిలాడే మనసు చంపుకొని దిగజారే రకం కాదు. అది బతికుండగా కాదు. నా వెనకాల ప్రజలు ఉన్నారు. నాకు కావాల్సింది ప్రజలు.. వాళ్ల బాగోగులు, నియోజకవర్గ అభివద్ధి. ఒకవేళ ఏదైనా మంచి జరిగితే ప్రజలకు మంచి జరుగుతుంది. లేకపోతే ప్రజల మధ్యనే ఉంటా ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా’అని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. 

ఏదైనా ప్రజల కోసమే..
‘పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ల దగ్గరకు తీసుకొచ్చిన. నేను రాజీనామా చేసి.. 100 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల వద్దకు తీసుకొచ్చినాను. అవసరమైతే అంత దూరమైనా పోతా. నేను భయపడను. ఏదైనా మంచి పనిచేస్తే మీ కోసం చేస్తాను. త్యాగమైనా, పోరాటమైనా మీరు తలదించుకొనే పని ప్రాణం పోయినా చేయను. సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్‌ నియోజకవర్గానికి రూ.5వేల కోట్ల నిధులు అభివద్ధికి తీసుకొని పోతే నాకు నిద్ర పట్టలేదు. పదవి లేకున్నా పైసలు మునుగోడు నియోజకవర్గ అభివద్ధికి రావాలి. ఈ విషయంలో రాజీపడేది లేదు’అని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ కుంభం శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు కరంటోతు శ్రీనివాస్‌నాయక్, గుత్త ఉమాదేవి, ప్రేంచందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement