
సాక్షి, హైదరాబాద్: మద్యం దుకాణాల దరఖాస్తులకు భారీ స్పందన వచ్చింది. నిన్నటి వరకు 50 వేల దరఖాస్తులు వచ్చాయి. ఈ రోజు మరో 50 వేల దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ శాఖ అంచనా. ఒక్కో దరఖాస్తుకు మూడు లక్షల రూపాయలుగా నిర్ణయించారు. రాష్ట్రంలో 2620 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈ నెల 23న మద్యం దుకాణాలకు ఎక్సైజ్ శాఖ డ్రా నిర్వహించనున్నారు. గౌడ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు ఎక్సైజ్ శాఖ రిజర్వేషన్లు కల్పించింది. యూపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి వచ్చి కూడా మద్యం దరఖాస్తులు చేసుకున్నారు.
దరఖాస్తుల ద్వారా మూడు వేల కోట్ల పైగా ఆదాయం వస్తుందని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ఏపీకి చెందిన మహిళ 150 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 67 వేల దరఖాస్తులను ఎక్సైజ్ శాఖ అధికారులు స్వీకరించారు.