
ఢిల్లీ: నోయిడా మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విపిన్‌కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భార్యను హత్య చేసిన విపిన్.. ఏ మాత్రం పశ్చాత్తాపం కనబడటం లేదు. ‘‘నేను చంపలేదు.. తనే చనిపోయింది’’ అంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నాడు.
నిక్కీ బ్యూటీపార్లర్ ఓపెన్ చేయడాన్ని విపిన్ వ్యతిరేకించడంతో పాటు.. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పోస్ట్ చేయడం కూడా హత్యకు గల కారణాలుగా పోలీసులు చెబుతున్నారు. నిక్కీ మర్డర్ కేసులో విపిన్ తల్లి దయాభాటి హస్తం కూడా ఉన్నట్లు తేలింది. కిరోసిన్ బాటిల్ అందించినట్లు నిక్కీ సోదరి కంచన్ ఫిర్యాదులో పేర్కొంది. దయాభాటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. 14 రోజుల రిమాండ్ విధించారు.
యూపీలో గ్రేటర్ నోయిడా పరిధిలోని సిర్సా గ్రామంలో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే లక్షల కట్నం చాలదని, మరింత తేవాలని చిత్రహింసలు పెట్టి, చితకబాది, చివరకు యాసిడ్ పోసి, ఆపై సజీవదహనం చేసినట్టు వెల్లడైంది! దాంతో ఆ నరరూప రాక్షసుడు కటకటాలపాలయ్యాడు. సీన్ రీ కన్‌స్ట్రక్షన్ కోసం తీసుకెళ్తుండగా పారిపోయేందుకు యతి్నంచి, పోలీసుల తూటా దెబ్బకు గాయపడి మళ్లీ ఊచలు లెక్కిస్తున్నాడు. అతనితో పాటు, కోడలిని రాచిరంపాన పెట్టిన అత్తను కూడా అరెస్టు చేశారు.
సిర్సా వాసి సత్యవీర్ రెండో కొడుకు విపిన్‌కు 26 ఏళ్ల నిక్కీతో 2016లో పెళ్లయింది. లక్షల నగదుతో పాటు స్కార్పియో కారు, విలువైన వస్తువులు కట్న కానుకలుగా ఇచ్చారు. ఇటీవల సత్యవీర్ బెంజ్ కారు కొనుకున్నాడు. తనకూ అలాంటి మరో కారైనా, మరో రూ.36 లక్షల అదనపు కట్నమైనా తేవాలని నిక్కీని విపిన్ హింసించసాగాడు. అందుకు తల్లి దయావతి వంతపాడేది. పెద్ద కొడుకు భార్య అయిన నిక్కీ అక్కడ కంచన్‌కు కూడా వేధింపులు మొదలయ్యాయి. గురువారం రాత్రి నిక్కీని ఇష్టానికి బాది, యాసిడ్ పోసి మరీ నిప్పంటించారు. అగ్నికి ఆహుతవుతూ మెట్ల నుంచి నిక్కీ పడిపోతున్న వీడియోలు వైరల్‌గా మారాయి.
భర్త, అత్త కలిసి ఆమెను జుట్టుపట్టి కొడుతున్న వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. వాటిని కంచన్ రికార్డు చేసి పోలీసులకు అందించింది. తీవ్రగాయాల పాలైన నిక్కీని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలొదిలింది. ‘‘నా చెల్లెలిని కొట్టొద్దని వారించినందుకు నన్నూ చితకబాదారు. తన తల, మెడపై విపరీతంగా కొట్టి యాసిడ్ పోశారు’’ అంటూ కంచన్ వాంగ్మూలమిచి్చంది. ఆమె ఫిర్యాదు మేరకు విపిన్, దయావతిని అరెస్టు చేశారు.
సీన్ రీకన్‌స్ట్రక్ఛన్ కోసం నిక్కీని ఆదివారం మధ్యాహ్నం అతన్ని ఘటనాస్థలికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో ఎస్సై నుంచి పిస్టల్ లాక్కొని పారిపోయాడు. వెంటాడుతున్న పోలీసులపైకి కాల్పులకు తెగబడ్డాడు. దాంతో అతని కాళ్లపై షూట్ చేశారు. కుప్పకూలాక అదుపులోకి తీసుకున్నారు.

పాపం పసివాడు! ఆరేళ్ల లేత ప్రాయం. కన్నతల్లిని తన తండ్రే నాయనమ్మతో కలిసి మరీ కర్కశంగా సజీవ దహనం చేస్తుంటే కళ్లారా చూడాల్సి వస్తుందని కల్లో కూడా అనుకుని ఉండడు! ‘‘అమ్మను నాన్న, నానమ్మ చెంపపై బాగా కొట్టారు. మండిపోయేది అమ్మపై పోశారు. తర్వాత నాన్న లైటర్‌తో నిప్పు పెట్టాడు’’ అంటూ జరిగిన దారుణాన్ని పోలీసులకు చెప్పుకుంటూ వెక్కిళ్లు పెడుతున్న ఆ బాలున్ని చూసి కంటతడి పెట్టని వారు లేరు.