
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కాసేపట్లో ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో యూనివర్సిటీ లోపల, బయట భారీ బందోబస్తు ఏర్పాటు aచేశారు. రోడ్లను బ్లాక్ చేయడానికి పలుచోట్ల రోడ్డుకు ఇరువైపులా పోలీసులు కంచెలు ఏర్పాటు చేశారు.
ఇక, 20 ఏళ్ల తర్వాత ఓయూలో ముఖ్యమంత్రి హోదాలో పర్యటించి, ప్రసంగించనున్న తొలి సీఎం రేవంత్ రెడ్డి కానున్నారు. ఓయూలోని టాగూర్ ఆడిటోరియంలో 1000 మందికి పైగా ప్రొఫెసర్లు, విద్యార్థుల సమక్షంలో ‘తెలంగాణ విద్యా రంగంలో రావాల్సిన మార్పులు-ప్రభుత్వ ప్రణాళిక’ అనే అంశంపై ఆయన ప్రసంగించనున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి. కాశీంలు ఇటీవల ఆహ్వానించారు. ఈ క్రమంలో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం 11 గంటలకు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. రూ.80 కోట్ల వ్యయంతో నిర్మితమైన రెండు కొత్త హాస్టళ్లను సీఎం ప్రారంభించనున్నారు. 1200 మంది విద్యార్థులకు వసతి కల్పించే వీటి ప్రారంభంతో ఓయూలో వసతి సౌకర్యాలు మరింత విస్తరించనున్నాయి. అదేవిధంగా, గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో 300 మంది విద్యార్థులకు వసతి కల్పించే మరో రెండు హాస్టళ్ల నిర్మాణానికి శంకుస్థాపన జరుగనుంది.
మరోవైపు.. సీఎం రేవంత్ ఓయూ పర్యటన నేపథ్యంలో ఆదివారం నుంచే క్యాంపస్ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. నిరుద్యోగుల నిరసనలు తలెత్తే అవకాశం ఉందన్న సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సీఎం రేవంత్ భద్రతా చర్యల్లో భాగంగా ఓయూ క్యాంపస్ మొత్తం ఇనుప కంచెల నడుమ ముట్టడి చేసినట్టుగా కనిపిస్తోంది. అడుగడుగునా కంచెలు బిగించి, పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.