
నగరంలో తిలక్ స్ఫూర్తితో మొదలైన వేడుకలు
చవితి ఉత్సవాలకు ఆర్యసమాజ్ అంకురార్పణ
సామరస్యమే లక్ష్యంగా సామూహిక నిమజ్జనం
27 నుంచి గణేష్ నవరాత్రులకు సిటీ సిద్ధం
హైదరాబాద్: ఒక వైవిధ్యభరితమైన వేడుక. శతాబ్దాల సాంçస్కృతిక ఉత్సవం. కులమతాలకు అతీతంగా ఒక్కటైన ఉత్సాహం. విభిన్న జీవన సంస్కృతుల ఆవిష్కరణ భాగ్యనగరం. ప్రతి మనిషి సమూహమయ్యే వేడుక. మహోన్నతమైన భాగ్యనగర సాంçస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే వినాయక వేడుకలు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. తొమ్మిది రోజుల పాటు విభిన్న ఆకృతులలో భక్తకోటిని మంత్రముగ్ధులను చేసే వినాయక చవితి ఉత్సవాలు ఈ నెల 27 నుంచి సంబరంగా జరుపుకొనేందుకు నగరం సిద్ధమవుతోంది.
శతాబ్దాలుగా లంబోదరుడు భక్తజనుల పూజలను అందుకుంటూనే ఉన్నాడు. శాతవాహనులు, రాష్ట్రకూటులు, చాళుక్యుల కాలం నుంచే ప్రజలు విఘ్నేశ్వరుడి పండగ చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది. ప్రజల్లో దేశభక్తిని, జాతీయతను పెంచేందుకు ఛత్రపతి శివాజీ వినాయక వేడుకలను ఘనంగా జరిపేవాడని చెబుతారు. కానీ.. అప్పటికి ఇంకా ఈ వేడుక సామూహికం కాదు. 1818 నుంచి 1892 వరకు గణపతి నవరాత్రి ఉత్సవాలు కేవలం ఇళ్లకే పరిమితమయ్యాయి. ఎవరి ఇంట్లో వాళ్లు గణనాథుడికి పూజలు చేసి, భక్తితో కొలిచేవారు. 1893 తర్వాతే సామూహిక ఉత్సవమైంది. ప్రజలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు, స్వాతంత్య్రోద్యమాన్ని బలోపేతం చేసేందుకు లోకమాన్య బాల గంగాధర తిలక్ లాల్‌బాగ్‌లో తొలిసారి నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఇలా మహారాష్ట్రలో ప్రారంభమైన ఈ వేడుకలు అనతి కాలంలోనే హైదరాబాద్‌లోనూ మొదలయ్యాయి.
వేడుకలు ఇలా మొదలు..
నిజాం నిరంకుశత్వానికి ఎదురు నిలిచిన ఆర్య సమాజ్ నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించింది. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో బహదూర్‌యార్‌జంగ్, ఖాసీం రజ్వీ నేతృత్వంలో జరిగిన అకృత్యాలను తిప్పికొట్టేందుకు ఆర్యసమాజ్ వాడవాడలా వినాయక మండపాలను నెలకొల్పి విగ్రహాలను ఏర్పాటు చేసింది. పండిత్ నరేంద్రజీ నేతృత్వంలో వేలాది మంది కార్యకర్తలు నగరంలో నవరాత్రి ఉత్సవాలను నిర్వహించారు.
భజనలు, దేశభక్తి గీతాలతో, వివిధ రకాల ఆటల పోటీలతో తొమ్మిది రోజులు గడిచేవి. కానీ అప్పటికి ఇంకా చిన్నచిన్న మట్టి ప్రతిమలే పెట్టేవాళ్లు. 1950 అనంతరం ఈ వేడుకలు అన్ని చోట్లా ఘనంగా జరిగాయి. బాలాపూర్, లాల్‌దర్వాజా, మీరాలం ట్యాంక్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో అందమైన బొజ్జగణపయ్యలు కొలువుదీరారు. నిజాం కాలంలో లక్ష్మయ్య, ఎంకమయ్య, మరికొందరు భక్తులు కలిసి హుస్సేనీ ఆలం బారాగల్లీలో చిన్న వినాయకుడి విగ్రహాన్ని ప్రతిబించారు. మీరాలంమండి వినాయకుడికి 150 సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు స్థానికులు చెబుతారు. ఇక 1953లో అప్పటి స్వాంతంత్య్ర సమరయోధుడు శంకర్ ఖైరతాబాద్‌లో ఒక్క అడుగు ఎత్తు వినాయకుడితో వేడుకలను ప్రారంభించారు.
సామూహిక నిమజ్జనం ఇలా..
ఆ రోజుల్లో హైదరాబాద్‌లో వందల సంఖ్యలోనే మండపాలు వెలిసేవి. సఫిల్‌గూడ, సరూర్‌నగర్, మీరాలంట్యాంకు, రాజన్న బావి తదితర చెరువుల్లో నిమజ్జనం చేసేవాళ్లు. 1979 నాటి నిమజ్జనోత్సవానికి కంచి శంకరాచార్యులు ముఖ్య అతిథిగా విచ్చేశారు. చారి్మనార్ స్వాగత వేదికపై నుంచి ప్రసంగించారు. విగ్రహాలను ట్యాంక్‌బండ్‌లోనే నిమజ్జనం చేయాలని నిర్ణయించారు. వందేమాతరం రామచంద్రయ్య నేతృత్వంలో ఆలె నరేంద్ర, బద్దం బాల్‌రెడ్డి, దత్తాత్రేయ, భరత్‌సింగ్, డాక్టర్ భగవంత్‌రావు తదితరులు 1980లో భాగ్యనగర గణేశ్ ఉత్సవ సమితిని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నగరంలోని అన్ని ప్రాంతాలకు
చెందిన వినాయక విగ్రహాలు హుస్సేన్‌సాగర్ బాట పట్టాయి.
నేడు నేత్రోనిలనం
ఖైరతాబాద్: ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి 69 అడుగుల ఎత్తులో 28 అడుగుల వెడల్పుతో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమయ్యాడు. మహా గణపతిని పూర్తిగా మట్టితోనే తీర్చిదిద్దినట్లు శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ తెలిపారు. దేశంలోనే మట్టితో ఇంత ఎత్తులో విగ్రహాన్ని తయారు చేసి ఊరేగించి.. నిమజ్జనం చేయ డం ఖైరతాబాద్ వినాయకుడి ఘనత అని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 27న వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయని, సెపె్టంబరు 6న నిమ జ్జనం జరుగుతుందన్నారు. సోమవారం ఉదయం మహా గణపతి ప్రతిమకు కంటిపాపను (నేత్రోనిలనం) అమర్చడం ద్వారా ప్రాణ ప్రతిష్ఠ చేసినట్లవుతుందని శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ తెలిపారు.