ఖైరతాబాద్‌ గణపయ్య సిద్దం.. | Khairatabad Ganesh 2025: 69-Foot Idol Unveiled for Vinayaka Chavithi Celebrations in Hyderabad | Sakshi
Sakshi News home page

ఖైరతాబాద్‌ గణపయ్య సిద్దం..

Aug 27 2025 7:13 AM | Updated on Aug 27 2025 10:17 AM

khairatabad ganesh 2025 Pooja And Details

సాక్షి, హైదరాబాద్‌: నేడు వినాయక చవితి. విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో పూజలు అందుకోవడానికి ఖైరతాబాద్‌ వినాయకుడు సిద్ధమయ్యాడు. నేటి వినాయక చవితి ఉత్సవాలు మొదలుకానున్నాయి. సర్వాంగ సుందరంగా మహాగణపతి దర్శనమిస్తున్నాడు. ఇప్పటికే ఖైరతాబాద్‌ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతోంది. కొందరు భక్తులు బడా గణేశ్‌ వద్ద సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు.  

ఈ ఏడాది 69 అడుగుల ఎత్తు, 28 ఆడుగుల వెడల్పుతో శాంతమూర్తిగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిశక్తి సమేతుడిగా గణనాథుడు రూపుదిద్దుకుంటున్నాడు. గణపయ్యకు ఇరువైపులా పూరి జగన్నాథుడు సుభద్ర, బలరాముడి సహా లక్ష్మీ సమేత హయగ్రీవస్వామి, ఖైరతాబాద్ గ్రామదేవతగా పిలువబడే గజ్జెలమ్మ అమ్మవారిని తీర్చిదిద్దుతున్నారు.

ఖైరతాబాద్ గణేశునికి 71 ఏళ్ల చరిత్ర ఉంది. వినాయక చవితి రోజున ఉదయం 6 గంటలకు తొలి పూజ ఉంటుంది. ఆ తర్వాత 10 గంటలకు కలశ పూజ, ప్రాణ ప్రతిష్ట చేస్తారు. ప్రాణ ప్రతిష్టకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ దిష్ణు దేవ్ వర్మ హాజరు కానున్నారు. 20 మంది సిద్ధాంతిలు కలశపూజ, ప్రాణప్రతిష్ఠ నిర్వహిస్తారు. 1954లో ఒక అడుగుతో మొదలైన ఖైరతాబాద్ వినాయకుడి ప్రస్థానం.. 60 ఏళ్ల పాటు ప్రతి ఏటా ఒక్కో అడుగు పెరుగుతూ.. ఆపై 2014 నుంచి ప్రతియేటా ఒక్కో అడుగు తగ్గిస్తూ వచ్చారు.

ఇక, గణపతికి తొమ్మిది రోజులు తొమ్మిది రకాల హోమాలు చేస్తారు.. అదేవిధంగా కాశీ నుంచి లక్ష రుద్రాక్షలు తీసుకువచ్చి గణపతి మెడలో వేస్తారు. వినాయకుడి కళ్యాణంతో పాటు పదవి విరమణ చేసిన ప్రభుత్వ పురోహితులచే లక్ష వినాయక నామార్చన చేయనున్నారు. ఖైరతాబాద్ గణేషుడికి  60 అడుగుల భారీ చేనేత నూలు కండువా, 60 అడుగుల గాయత్రి యజ్ఞోపవీతాన్ని చేనేత కార్మికులు ప్రత్యేకంగా తయారు చేయించి సమర్పిస్తారు.

మహా గణపతి వద్ద పోలీసులు భారీ బందోబస్తుతో భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. 600 మంది పోలీసులతో పాటు, 60 సీసీ కెమెరాలతో భద్రతా పర్యవేక్షణ చేయనున్నారు. 100 మంది ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది, అంబులెన్సులు కూడా సిద్ధం చేశారు. సెప్టెంబర్ 6 సాయంత్రం వరకు ప్రతిరోజూ ఉదయం 6 నుండి రాత్రి 11 గంటల వరకు భక్తులు దర్శనం చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భక్తుల రద్దీని బట్టి ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్ అధికారులు అంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి శోభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement