
ఇళ్ల నిధులు దారి మళ్లకుండాగృహ నిర్మాణ శాఖ జాగ్రత్తలు
సాంకేతిక లోపాలను గుర్తించేలా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్
సాక్షి, హైదరాబాద్: ఒకరి ఖాతాల్లోకి చేరాల్సిన ఇందిరమ్మ ఆర్థిక సాయం, మరొకరి ఖాతాల్లోకి చేరుతుండటాన్ని గృహ నిర్మాణ శాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ పరిస్థితిని నివారించేందుకు ఏఐ ఆధారిత పరిజ్ఞానాన్ని వినియోగించాలని నిర్ణయించింది. బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించే సమయంలో బ్యాంకర్లు చేసిన తప్పిదాల వల్ల ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల ఆర్థిక సాయం పంపిణీలో తీవ్ర గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే.
ఇదే విషయాన్ని వివరిస్తూ శనివారం సాక్షి పత్రికలో ‘‘ఆధార్ ఒకరిది... ఖాతా మరొకరిది’’అన్న శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఇందిరమ్మ లబ్దిదారుల ఆధార్ నంబర్ ఇతరుల బ్యాంకు ఖాతాలతో అనుసంధానం కావటంతో, ఇందిరమ్మ లబ్దిదారుల ఖాతాల్లోకి జమ కావాల్సిన మొత్తం ఇతరుల ఖాతాల్లోకి జమ అవుతున్న తీరును సాక్షి సోదాహరణంగా వెలుగులోకి తెచి్చంది. లబ్దిదారుల నుంచి ఫిర్యాదులు అందటంతో గృహనిర్మాణ శాఖ దీనిపై దృష్టి సారించింది.
చెల్లింపు విధానం మార్పు
ప్రస్తుతం ఇందిరమ్మ లబ్దిదారులకు ఆర్థిక సాయాన్ని వారి ఆధార్ నంబర్ ఆధారంగా చెల్లిస్తున్నారు. ఆ ఆధార్ నంబర్ ఏ బ్యాంకు ఖాతాతో అనుసంధానమై ఉందో ఆ బ్యాంకు ఖాతాలోకి ఆటోమేటిక్‌గా నిధులు జమ అవుతాయి. అలా జరిగేలా ప్రత్యేక సాంకేతిక వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
కానీ బ్యాంకు ఖాతాలతో ఆధార్ నంబర్‌ను అనుసంధానించే సమయంలో చాలా బ్యాంకుల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఒకరి ఖాతాకు మరొకరి ఆధార్ నంబర్‌ను అనుసంధానించారు. దీంతో లబ్ధిదారులకు బదులు ఇతరుల ఖాతాల్లో సొమ్ము జమ అవుతోంది. ఇది బహిర్గతం కావడంతో చెల్లింపు విధానంలో మార్పులు తీసుకువస్తున్నారు.
సాంకేతిక వ్యవస్థలో మార్పులు
ఆధార్ నంబర్ ఆధారంగా చెల్లింపు జరిగే సమయంలో లబ్దిదారు పేరును పరిశీలించేలా ఏఐ టెక్నాలజీతో అప్‌డేట్ చేస్తున్నారు. లబ్దిదారు జాబితాలో ఉన్న పేరుతో అక్షరం అక్షరం సరిపోలేలా సాఫ్ట్‌వేర్‌ను ఫీడ్ చేస్తున్నారు. పేరులో ఏమాత్రం తేడా ఉన్నా ఆర్థిక సాయం బ్యాంకు ఖాతాలో జమ కాకుండా నిలిచిపోతుంది.
లబ్దిదారు పేరు, ఆధా ర్ నంబర్ జత అయిన మరో వ్యక్తి పేరు ఒకటే అయినప్పుడు.. ఇంటి పేరుతో సరిపోల్చి చూడనున్నారు. ఇంటి పేరు ఒకటే అయినప్పుడు ఇంటి నంబరుతో సరిపోల్చి చూసేలా కొత్తగా అప్‌డేట్ చేస్తున్నారు. దీంతో ఆర్థిక సాయం మొత్తం తప్పు డు ఖాతాలో జమ కాకుండా ఉండటమే కాకుండా, అధికారులకు కూడా ఆ విషయాన్ని తెలిపేలా సాంకేతిక వ్యవస్థలో మార్పులు చేస్తున్నారు.