
బీబీనగర్ పెద్ద చెరువులో దూకిన యువకుడు..
ఇంకా దొరకని ఆచూకీ
భర్త లేకుండా తానూ ఉండలేనంటూ చెరువులో దూకిన భార్య
కాపాడిన రెస్క్యూ టీమ్
యాదాద్రి భువనగిరి జిల్లా: ‘తనను పది రోజులుగా చావు పిలుస్తుంది.. నేను చావు వద్దకు వెళ్లిపోతున్న.. ఇందులో ఎవరి ప్రమేయం లేదు’అంటూ ఓ యువకుడు చెరువులో దూకాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. బంధువులు, పోలీసులు, యువకుడి వాయిస్ రికార్డులో నమోదైన వివరాల ప్రకారం...హనుమకొండ జిల్లా రాంనగర్‌కు చెందిన బర్ల సురేందర్ (36) ఉప్పల్ సమీపంలోని రామాంతపూర్‌లో డీమార్ట్ వెనుకాల తన భార్య, కొడుకుతో నివాసం ఉంటున్నాడు. సురేందర్ హైటెక్ సిటీలోని ఓప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. పది రోజులుగా సురేందర్ మానసిక స్థితి బాగాలేకపోవడంతో ఏదేదో మాట్లాడుతుండేవాడు.
నిత్యం చావు కల వస్తుందని, తన వద్దకు రమ్మని చావు పిలుస్తుందని, దేవుళ్లు పిలుస్తున్నట్టు పీడ కలలు వస్తున్నాయని, తాను చనిపోతానని కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులకు చెబుతుండేవాడు. కాగా కుటుంబసభ్యులు అతని పలు దేవాలయాలు, దైవదర్శనాలకు తిప్పారు. మానసిక పరిస్థితి మెరుగుపడటంతో ఉద్యోగానికి వెళ్లానని కుటుంబ సభ్యులు చెప్పడంతో ఒప్పుకున్నాడు. నాలుగు రోజులుగా ఉద్యోగానికి వెళ్తున్న సురేందర్.. శుక్రవారం ఉదయం కూడా డ్యూటీకి వెళుతున్నట్టు ఇంట్లో చెప్పాడు. క్యాబ్ బుక్ చేసుకొని బీబీనగర్ పెద్ద చెరువు వద్దకు చేరుకున్నాడు. అక్కడి నుంచి తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు.
చావు రమ్మటుంది.. నేను వెళ్తున్నానని, చెరువులో దూకి చనిపోతున్నానని, తన చావు కార్యక్రమాలు పాత ఇంట్లో చేయాలని, నా చావుకు ఎవరూ కారణం కాదని సెల్‌ఫోన్‌లో వాయిస్ రికార్డ్ చేసి పంపాడు. ఆ తర్వాత బూట్లు, సెల్‌ఫోన్ చెరువు కట్టపై పెట్టి చెరువులో దూకాడు. బంధువుల సమాచారంతో పోలీసులు, రెస్క్యూ టీం చెరువులో గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ దొరకకపోవడంతో అక్కడే ఉన్న సురేందర్ భార్య.. భర్త లేనిదే తాను ఉండలేనంటూ చెరువులో దూకింది. అప్రమత్తమైన రెస్క్యూ టీం ఆమెను కాపాడింది. శుక్రవారం రాత్రి వరకు గాలించినా సురేందర్ ఆచూకీ లభించకపోవడంతో శనివారం కూడా గాలింపు చర్యలు చేపట్టే అవకాశముంది.