భయం వీడితే జయం మనదే...

World Suicide Prevention Day Special Story - Sakshi

కోవిడ్‌ భయాందోళనలు వద్దంటున్న వైద్యులు 

సమష్టిగా ఎదుర్కోవడమే పరిష్కారమంటున్న నిపుణులు 

నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం   

సాక్షి, హైదరాబాద్‌: సరిగ్గా రెండు నెలల క్రితంఖైరతాబాద్‌లోని ఆనంద్‌నగర్‌ ప్రాంతంలో ఓ వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. నాలుగు రోజులుగా  తగ్గని జ్వరమే అందుకు కారణం. ఆ జ్వరాన్నే కరోనాగా భావించి తమ వల్ల  తమ కుటుంబ సభ్యులకు సోకుతుందేమోననే ఆందోళనతోనే బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆ తరువాత కొద్ది రోజులకే ఒక కోవిడ్‌ పేషెంట్‌ ఆసుపత్రి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. గాంధీ ఆసుపత్రిలో చేరిన  మరో పేషెంట్‌  చికిత్స పొందుతూనే ఆసుపత్రి నుంచి పారిపోయాడు. ఇదంతా కరోనాకు ఒకవైపు అయితే మరోవైపు  కరోనా కల్లోలాన్ని సృష్టించింది. మహమ్మారి నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా  లక్షలాది మంది ఉపాధి అవకాశాలను కోల్పోయారు.

ప్రశాంతంగా బతికిన కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభం భయాందోళనలు రేపింది. దీంతో అనేక కుటుంబాలు ఆత్మహత్యా సదృశ్యమైన  పరిస్థితులను  ఎదుర్కొంటున్నాయి. భార్యాభర్తల మధ్య ఘర్షణలు, గృహహింస, ఆన్‌లైన్‌ చదువుల వల్ల పిల్లల్లో పెరిగిన మానసిక వ్యాకులత, ఆందోళన, డిప్రెషన్‌ వంటి అనేక సమస్యల వల్ల నగరంలో సూసైడల్‌ టెండెన్సీ అతి పెద్ద సవాల్‌గా మారింది. ఆత్మహత్యలకు వ్యతిరేకంగా పని చేస్తున్న  స్వచ్చంద  సంస్థ రోష్ని  అంచనాల  మేరకు  గతంతో పోల్చుకుంటే కరోనా కారణంగా సూసైడల్‌ టెండెన్సీ 20 శాతం వరకు పెరిగింది. గత మూడు నెలలుగా రోష్ని సహాయ కేంద్రానికి వచ్చిన సుమారు  5000  ఫోన్‌కాల్స్‌లో  ఎక్కువ శాతం  ఆత్మహత్యా పరిస్థితులకు సంబంధించిన బాధితులవే  ఉన్నట్లు  ఆ సంస్థ  వెల్లడించింది.

కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితుల్లో  మానసిక తోడ్పాటును, ఆత్మస్థైర్యాన్ని  అందజేసేందుకు అనేక స్వచ్చంద సంస్థలు సైతం ముందుకు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా  పెరుగుతున్న ఆత్మహత్యల నివారణే లక్ష్యంగా  2003 నుంచి యూఎన్‌వో పిలుపు మేరకు సెప్టెంబరు 10ని ఆత్మహత్యల నివారణ దినంగా పాటిస్తున్నారు. ఈ ఏడాది కరోనా మహమ్మారి మొత్తం భూగోళాన్నే కబళించింది. యావత్‌ ప్రపంచాన్ని అనిశ్చితిలోకి నెట్టేసింది. ఈ నేపథ్యంలో ‘ఆత్మహత్యల నివారణకు కలసి పని చేయాలనే’ సమష్టి కర్తవ్యానికి పిలుపునిచ్చింది ఐక్యరాజ్యసమితి. 

ఆత్మస్థైర్యమే ఆయుధం..
రాము (పేర్‌ మార్చాం) ఒక సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగి. కోవిడ్‌ కారణంతో ఉద్యోగం కోల్పోయాడు. దీంతో ఏర్పడిన తీవ్ర ఆర్థిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్యే  సమస్యకు పరిష్కారమని భావించాడు. కానీ అదే సమయంలో ఒక ప్రైవేట్‌ స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్న  ప్రశాంత్‌ ఉద్యోగాన్ని కోల్పోయినప్పటికీ  ఏ మాత్రం ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా  కూరగాయల వ్యాపారం చేస్తూ  ఉపాధి పొందుతున్నాడు. ఒక్క ప్రశాంత్‌ మాత్రమే కాదు. లక్షలాది మంది పూలమ్మిన చోటే కట్టెలమ్ముతూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఆర్థిక సంక్షోభాన్ని ఆత్మస్థైర్యంతో ఎదుర్కొంటున్నారు. వైరస్‌ బారిన పడిన వారిలోనూ చాలా మంది మహమ్మారిని భయాందోళనకు గురికాకుండా వైద్య చికిత్సలు పొందుతూ ధైర్యంగా జయిస్తున్నారు. (క‌రోనా పాజిటివ్.. త‌ప్పుడు రిపోర్ట్ అనుకుంటా)

తీవ్రమైన, భయం ఒత్తిడికి గురయ్యేవారిలోనే  మరణాలు చోటుచేసుకుంటున్నట్లు వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కోవిడ్‌ విసిరిన సవాళ్లెన్నో ఉన్నాయి. ఈ మహమ్మారి బారిన పడిన ప్రజలు ఆరోగ్య, వృత్తిపరమైన, ఆర్థిక పరమైన ఒత్తిడిలకు లోనవుతున్నారు. ఇలా ఏర్పడిన మానసిక, శారీరక ఒత్తిడుల కారణంగా అటు కోవిడ్‌ వచ్చిన వారిలో, రాని వారిలోనూ డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కరోనా కారణంగా నెలకొన్న ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఆత్మస్థైర్యాన్ని మించిన ఆయుధం మరొకటి లేదు.   

మేమున్నామనీ..
ఇదే సమయంలో కోవిడ్‌ కారణంగా నెలకొన్న పరిస్థితుల్లో మానసిక ధైర్యాన్ని, ఓదార్పును అందజేసేందుకు, ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మేమున్నామంటూ అనేక స్వచ్చంద సంస్థలు ముందుకొస్తున్నాయి. సికింద్రాబాద్‌లోని సింధ్‌కాలనీ కేంద్రంగా పని చేస్తున్న రోష్ని సంస్థ ప్రత్యేక కాల్‌సెంటర్‌ను నిర్వహిస్తోంది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఉన్నవారు ఈ కేంద్రాన్ని సంప్రదిస్తే సరైన పరిష్కారం లభిస్తుందని, నిపుణుల ద్వారా అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందజేయగలమని సంస్థ ప్రతినిధి ఆనంద దివాకర్‌ తెలిపారు. గత  3 నెలలుగా  5 వేల మందికి పైగా తమ సంస్థను సంప్రదించి పరిష్కారం పొందినట్లు  పేర్కొన్నారు. కుటుంబ కలహాలు, ఉపాధి కోల్పోవడం, కోవిడ్‌ భయంపైనే ఎక్కువ మంది  తమ ఆందోళనలను వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. 

అండగా మనో జాగృతి..
సుమారు 200 మంది మానసిక నిపుణులతో ప్రత్యేక నెట్‌ వర్క్‌ కలిగిన స్వచ్చంద సంస్థ మనోజాగృతి సైతం కోవిడ్‌ కారణంగా ఏర్పడిన మానసిక సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ప్రారంభించింది. మానసిక సమస్యలను ఎదుర్కొంటున్న వారికి  కౌన్సిలింగ్‌  ఇవ్వడంతో పాటు  పరిష్కార మార్గాలను సూచిస్తారు. ఉద్యోగాలు, విద్యార్ధులు, గృహిణులు, తదితర వర్గాల సమస్యలపైన ప్రత్యేక దృష్టి సారించాం. 
–  డాక్టర్‌ గీత చల్లా, మనోజాగృతి వ్యవస్థాపకులు  

వివరాలు గోప్యంగా ఉంటాయి  
ఐక్యరాజ్యసమితి మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా రోష్ని సేవలను అందజేస్తోంది. మానసిక నిపుణులు, కౌన్సిలర్లు  కచ్చితమైన పరిష్కారాన్ని సూచిస్తారు. ఇప్పటి వరకు అనేక వేల మందిని కాపాడగలిగాం. మా సంస్థను ఆశ్రయించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంటాయి. తమ బాధలను, సమస్యలను నిర్భయంగా చెప్పుకోవచ్చు. ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మా కాల్‌సెంటర్‌ (040–66202000, 040–66202001)ను సంప్రదించవచ్చు. 
– ఆనంద దివాకర్, రోష్ని   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top