కేటగిరీల మార్పు.. కార్మికుల్లో ఆందోళన | Workers Protest Against Minimum Wage Order: Telangana | Sakshi
Sakshi News home page

కేటగిరీల మార్పు.. కార్మికుల్లో ఆందోళన

Jun 5 2026 5:53 AM | Updated on Jun 5 2026 5:53 AM

Workers Protest Against Minimum Wage Order: Telangana

కొత్తగా తెచ్చిన కనీస వేతన ఉత్తర్వుల్లో గందరగోళంగా ఉద్యోగాలు 

మొత్తం ఎంప్లాయ్‌మెంట్లు 67, మొత్తం ఉద్యోగాలు 795 

అన్‌ స్కిల్డ్‌లో 150, సెమీ స్కిల్డ్‌లో 157, స్కిల్డ్‌లో 310, హైలీ స్కిల్డ్‌లో 178 ఉద్యోగాలు 

తాజా మార్పుతో ఆయా ఉద్యోగులంతా తక్కువ 

వేతన పరిమితికి పతనం... ప్రభుత్వం వేతనాలు

పెంచినా లబ్ధి కలగడం లేదంటూ కార్మికుల ఆందోళన

సాక్షి, హైదరాబాద్‌: కార్మికుల కనీస వేతనాల అమలు ఉత్తర్వుల్లో ఉద్యోగాల మార్పు తీవ్ర గందరగోళానికి దారితీసింది. రెండు దశాబ్దాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కనీస వేతనాలను సవరిస్తూ తీసుకున్న నిర్ణయంపై కార్మిక వర్గాలు సంబరాలు చేసుకోగా... తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో ఉద్యోగాల మార్పులు ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ మార్పుతో వేతనాలు పెంచినా, కేటగిరీలో మార్పులతో నష్టం కలుగుతుందని కార్మిక సంఘాలు లబోదిబోమంటున్నాయి.

రాష్ట్రంలోని అసంఘటిత రంగ కార్మికుల కనీస వేతనాలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జి.వివేక్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి కనీస వేతనాలను ప్రకటించారు. ఇందుకు సంబంధించి జీఓ 6ను మే 30వ తేదీన కార్మిక శాఖ కార్యదర్శి దాసరి హరిచందన జారీ చేశారు. తాజాగా ఈ ఉత్తర్వుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ ప్రచురించింది. ఇందులో పలు ఉద్యోగాల కేటగిరీలు మారాయి.  

కేటగిరీ మార్పుతో వేతనాల్లో కోత... 
రాష్ట్రంలో 67 ఎంప్లాయ్‌మెంట్లకు కనీస వేతనాలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులను నాలుగు కేటగిరీలుగా విభజించింది. అన్‌ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్‌ కేటగిరీలుగా విభజిస్తూ... రాష్ట్రంలో కొత్తగా మూడు జోన్లు ఏర్పాటు చేసి... జోన్ల వారీగా ఉద్యోగులకు వేతనాలను ఖరారు చేసింది. ఉద్యోగాలను నైపుణ్యం ఆధారంగా నాలుగు కేటగిరీల్లో చేర్చారు. ఏళ్లుగా ఆయా కేటగిరీల్లో కొనసాగిన ఉద్యోగాల్లో కొన్నింటిని కార్మిక శాఖ అధికారులు మార్పు చేశారు.

హైలీ స్కిల్డ్‌ ఉన్న ఉద్యోగాన్ని స్కిల్డ్‌లోకి, సెమీ స్కిల్డ్‌లోని ఉద్యోగాలను అన్‌స్కిల్డ్‌లోకి... ఇలా మూడు కేటగిరీల్లోని ఉద్యోగాల స్థాయి తగ్గించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజా మార్పుతో ఉద్యోగాలు డీగ్రేడ్‌ కావడంతో ప్రస్తుతం అందుకునే వేతనాలు సైతం తగ్గనున్నాయి.  

⇒  హెల్పర్‌ (కుక్, లారీ, బాయిలర్, బైండర్, బ్లాక్‌స్మిత్, ఆర్టిజన్, సాయర్, కార్పెంటర్, మేస్త్రీ), బోట్‌మెన్, ప్లాగ్‌మెన్, సిగ్నల్‌మెన్, టింకర్‌ ఉద్యోగాలు ఇప్పటివరకు సెమీ స్కిల్డ్‌లో ఉండగా... ప్రస్తుతం వీటిని అన్‌స్కిల్డ్‌ జాబితాలోకి చేర్చారు.  

⇒  మేట్‌ మిస్ట్రీ, బోట్‌మెన్‌ హెడ్, ఎక్సావేటర్, విన్‌్చమెన్‌ (మెకానికల్‌ ఇక్విప్‌మెంట్‌ ఆపరేటర్‌), అటెండెన్స్‌ కీపర్‌ తదితర ఉద్యోగాలు ఇప్పటివరకు స్కిల్డ్‌ కేటగిరీలో ఉండగా... తాజాగా వీటిని సెమీ స్కిల్డ్‌లోకి మార్పు చేశారు. 
⇒  ట్రైన్‌ ఎగ్జామినర్, ఆటో ఎల్రక్టీషియన్, లోకో డ్రైవర్, అసిస్టెంట్‌ మేనేజర్, ప్రొడక్షన్‌ మేనేజర్‌ తదితర ఉద్యోగాలు ఇప్పటివరకు హైలీ స్కిల్డ్‌ కేటగిరీలో ఉండగా, ఇప్పు డు వాటిని స్కిల్డ్‌ జాబితాలో పెట్టారు. 
⇒  ఈ ప్రక్రియ యాజమాన్యానికి, ఉద్యోగికి మధ్య తీవ్ర వివాదానికి దారితీస్తుందని కార్మిక సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొత్త ఎంప్లాయ్‌మెంట్‌లదీ అదే పరిస్థితి...
మారుతున్న పారిశ్రామిక విధానానికి అనుగుణంగా కొత్త ఎంప్లాయ్‌మెంట్లు చేర్చాలంటూ కార్మిక సంఘాలు ఏళ్లుగా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. కనీసం వెయ్యిమంది కార్మికులు పనిచేస్తున్న ఒక రంగానికి షెడ్యూల్డ్‌ ఎంప్లాయ్‌మెంట్‌గా ఏర్పాటు చేయాలని సూచించాయి. విద్యుత్‌ ఉత్పత్తి (థర్మల్, హైడ్రో, సోలార్, విండ్‌). టైర్లు ట్యూబ్‌ తయారీ, లైట్‌ మెటల్, హెవీ మెటల్‌ కాస్టింగ్‌ అండ్‌ మోల్డింగ్, ప్లాస్టిక్‌ ఇండస్ట్రీ, రబ్బర్‌ ఇండస్ట్రీ, ప్రభుత్వ స్కీమ్‌ల పరిధిలోని కార్మికులు, గని కార్మికులు, ఇంటర్నెట్‌ ప్రొవైడర్, ఐటీ సంస్థల కార్మికులను నూతన ఎంప్లాయ్‌మెంట్‌ల పరిధిలోకి తేవాలని ఐఎన్‌టీయూసీ, టీఎనీ్టయూసీ, హెచ్‌ఎంఎస్, ఏఐటీయూసీ, బీఎంఎస్, ఐఎఫ్‌టీయూ తదితర సంఘాలు వినతులిచ్చాయి. కొత్తగా పది రకాల షెడ్యూల్డ్‌ ఎంప్లాయ్‌మెంట్లను ప్రకటించినా, సంఘాల వినతులను పరిగణనలోకి తీసుకోకపోవడంపైనా నేతలు మండిపడుతున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement