మాయలేడీ: 17 ఏళ్లు పత్తా లేకున్నా పోస్టింగ్‌!

Women Illigal Posting In Board Of Intermediate Education Department - Sakshi

ఇంటర్‌ విద్యా శాఖలో అడ్డదారి పోస్టింగ్‌ బాగోతం 

ఒక్క ఏడాది విధులకు రాకుంటేనే.. ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి 

ఏకంగా 17 ఏళ్ల తర్వాత వచ్చిన మహిళకు పోస్టింగ్‌ ఇచ్చిన ఆర్జేడీ 

2011లోనే ఆమెను తొలగించినా..ఆ ఫైలు మాయం చేసి మరీ ఉద్యోగం 

హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ విద్యాశాఖలో అక్రమ పోస్టింగ్‌ బాగోతం బయటపడింది. విదేశాలకు వెళ్లిపోయి.. దాదాపు 17 ఏళ్లుగా డ్యూటీకి రాని ఓ మహిళా అధ్యాపకురాలికి ఇంటర్‌ విద్యాశాఖ పోస్టింగ్‌ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వానికి ఫైలు పంపించకుండా, ఎలాంటి ఆమోదం పొందకుండానే.. ఇంటర్‌ విద్యా శాఖ వరంగల్‌ ఆర్జేడీ జయప్రదబాయి ఈ పోస్టింగ్‌ ఇచ్చారు. పైగా ఇంటర్‌ విద్యా కమిషనరేట్‌ ఆదేశాల మేరకు నియమిస్తున్నట్టుగా పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి.. ప్రభుత్వ ఉద్యోగి సెలవు పెట్టకుండా విధులకు డుమ్మాకొట్టడం తప్పు. అదీ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ప్రభుత్వ ఆమోదం లేకుండా విదేశాలకు వెళ్లినవారికి పోస్టింగ్‌ ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం. అయినా పోస్టింగ్‌ ఇవ్వడం పట్ల తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

2003 నుంచీ అబ్‌స్కాండ్‌! 
1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీపీఎస్సీ ద్వారా జువాలజీ లెక్చరర్‌గా ఎంపికైన మహిళకు.. కరీంనగర్‌ జిల్లాలోని ఓ మహిళా జూనియర్‌ కాలేజీలో పోస్టింగ్‌ ఇచ్చారు. విధుల్లో చేరిన ఆమె కొన్నాళ్లే హాజరయ్యారు. ఉన్నతాధికారులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా 2003 నుంచీ ఆమె విధులకు గైర్హాజరైనట్టు (అబ్‌స్కాండ్‌) తెలిసింది. దాదాపు 17 ఏళ్లుగా ఆమె విదేశాల్లోనే ఉన్నారని, ఇటీవలే తిరిగి వచ్చాక.. తనకు పోస్టింగ్‌ ఇవ్వాలంటూ అధికారులను సంప్రదించారని సమాచారం. ఈ క్రమంలో అధికారులతో ఒప్పందం కుదరడంతో.. ఆమెకు గతంలో పనిచేసిన కాలేజీలోనే పోస్టింగ్‌ ఇస్తూ గతనెల 31వ తేదీన ఉత్తర్వులు జారీ అయినట్టు తెలిసింది. 

రూల్స్‌ ప్రకారమైతే.. రాజీనామా చేసినట్టే.. 
ఉమ్మడి ఏపీ నుంచి అమల్లో ఉన్న నిబంధనలు, 2007 జూన్‌ 1న జారీ చేసిన జీవో 128 ప్రకారం.. ఏ ప్రభుత్వ ఉద్యోగి, అధికారి అయినా ఒక ఏడాదికి మించి విధులకు గైర్హాజరైతే సదరు ఉద్యోగానికి రాజీనామా చేసినట్టే. అంతేకాదు అసలు సెలవు పెట్టినా, పెట్టకపోయినా ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం విధులకు హాజరుకాకున్నా రాజీనామా చేసినట్టుగానే పరిగణించాలి. ఈ క్రమంలోనే.. ముందస్తు సమాచారం ఇవ్వకుండా విధులకు రాని 56 మంది అధ్యాపకులను ఇంటర్‌ విద్యాశాఖ 2011లో తొలగించింది. అందులో ఈ అధ్యాపకురాలు కూడా ఉన్నారు.

కానీ అమెను విధుల్లోంచి తొలగించినట్టు నమోదు చేసిన ఫైలును కూడా మాయం చేసి మరీ పోస్టింగ్‌ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఇలా ఎలా పోస్టింగ్‌ ఇచ్చారన్నది వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వానికి ఫైలు పంపించి ఆమోదం తీసుకోకుండా పోస్టింగ్‌ ఇవ్వడం, ఎన్నాళ్ల నుంచి విధులకు రావట్లేదన్న వివరాలు పొందుపర్చకుండానే ఆమెను విధుల్లో చేర్చుకోవాలంటూ ఉత్తర్వులు జారీ చేయడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజీనామా చేసిన ఒక ఉద్యోగిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలంటే.. ప్రత్యేక కేసు కింద ముఖ్యమంత్రి మాత్రమే అనుమతిచ్చే అవకాశం ఉంటుంది. అలాంటిది అధికారులు నేరుగా పోస్టింగ్‌ ఇవ్వడం గమనార్హం. 

కమిషనరేట్‌ ఉత్తర్వుల మేరకే పోస్టింగ్‌: ఆర్జేడీ 
ఇంటర్మీడియట్‌ విద్యా కమిషనరేట్‌ నుంచి ఇచ్చిన ఉత్తర్వుల మేరకే మహిళా అధ్యాపకురాలు సోఫియాకు పోస్టింగ్‌ ఇచ్చినట్లు ఇంటర్‌ విద్యాశాఖ రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ జయప్రదబాయి తెలిపారు. సోఫియా ప్రభుత్వానికి, కమిషనర్‌ కార్యాలయానికి విజ్ఞప్తి చేసుకున్నారని.. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే ఆర్డర్‌ ఇచ్చామన్నారు. ఆమె విధులకు గైర్హాజరుకావడం, విదేశాలకు వెళ్లడంపై విచారణకు ఆదేశించామని చెప్పారు. విచారణ తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top