
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ఆవరణలో చెప్పులతో కొట్టుకుంటున్న మహిళా రైతులు
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో చోటుచేసుకున్న ఘటన
బారులు తీరినా బస్తా కూడా దొరకని వైనం
గజ్వేల్‌రూరల్/గరిడేపల్లి/దుబ్బాక/బీబీపేట: ఎప్పుడు వస్తుందో... ఎప్పుడు ఇస్తారో తెలియక యూరియా కోసం రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల రాస్తారోకోలు, ఆందోళనలు చేస్తుండగా, మరికొన్ని చోట్ల ఘర్షణలకు దిగుతున్నారు.
» సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ఆవరణలో మంగళవారం యూరియా టోకెన్ల కోసం బారులు తీరిన మహిళా రైతులు ఒకరినొకరు చెప్పులతో కొట్టుకున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు.
» వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లిలోని జాతీయ రహదారిపై యూరియా కోసం రైతులు ధర్నా చేశారు. రాయపర్తి మండలం పెర్కవేడులో యూరియా కోసం టోకెన్లు ఇస్తున్నారని తెల్లవారుజాము నుంచే రైతువేదిక వద్ద మహిళా రైతులు బారులుతీరారు.
» మహబూబాబాద్ జిల్లాలోని కురవి, మహబూబాబాద్ మండలాల్లో పీఏసీఎస్ కేంద్రాల వద్ద కూడా బారులుతీరారు. నర్సింహులపేట మండలంలోని పెద్దనాగారం స్టేజీ వద్ద వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు.
» కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రానికి మంగళవారం యూరియా వస్తుందని తెలుసుకున్న రైతులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. అలసిపోయి, నీరసించిన తర్వాత రైతులు క్యూ లైన్లో రాళ్లు, చెప్పులు, చెట్ల కొమ్మలు పెట్టారు.
» సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలోని మన గ్రోమోర్ సెంటర్‌కు రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి క్యూలైన్లలో నిలబడ్డారు. కేవలం 15 నుంచి 20 మందికి మాత్రమే రెండు బస్తాలు ఇచ్చి స్టాక్ అయిపోయిందని చెప్పడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.