అతనితో పెళ్లి జరిపించాలి.. లేకపోతే చచ్చిపోతా

Women Protesting In Police Station About Marriage With Lover Adilabad - Sakshi

ఖానాపూర్‌: మండలంలోని సత్తన్‌పల్లి గ్రామంలో ఓ యువతి మౌన పోరాటానికి దిగింది. గ్రామానికి చెందిన గుగ్లావత్‌ రాజశేఖర్‌ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ అతడి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టింది. గతంలో ఈ విషయమై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని వాపోయింది. యువకుడితో పెళ్లి జరిపించాలని లేకుంటే తనకు చావే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం యువతిని పోలీసులు సఖి కేంద్రానికి తరలించారు.   

ఆర్థిక ఇబ్బందులతో కళాకారుడి ఆత్మహత్య 
కౌటాల(సిర్పూర్‌): మండలంలోని శీర్షా గ్రామానికి చెందిన కందూరి పోశమల్లు(39) అనే ఒగ్గు కళాకారుడు ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో మంగళవారం వేకువజామున ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. వివరాలు.. శీర్షా గ్రామానికి చెందిన పోశమల్లు 20 ఏళ్లుగా ఒగ్గు కథలు చెబుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్నెళ్ల క్రితం అనారోగ్యానికి గురికావడంతో ఆయన ఎలాంటి పనులకు వెళ్లడం లేదు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టి కుటుంబ పోషణ భారంగా మారింది.

ఈ నేపథ్యంలోనే ఇబ్బందులు తాళలేక పోశమల్లు మంగళవారం వేకువజామున ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వెల్లడించారు. మృతుడికి భార్య సుమలత, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తెలంగాణ జానపద కళాకారుల సంఘం సభ్యుడిగా, ఒగ్గు కళాకారుడిగా సేవలందించిన పోశమల్లు మృతి చెందడంపై జానపద కళాకారులు విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top