ఈ నెల 28 నుంచి బేగంపేటలో వింగ్స్ ఇండియా ఏవియేషన్ షో
సాక్షి, న్యూఢిల్లీ: ఆసియాలోనే అతిపెద్ద సివిల్ ఏవియేషన్ షో కోసం హైదరాబాద్ మరోసారి వేదిక కానుంది. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ఈ నెల 28 నుంచి 31 వరకు వింగ్స్ ఇండియా–2026 నిర్వహించనున్నట్లు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపింది. గ్లోబల్ ఏరోహబ్‌గా భారత్ ఎదుగుతున్న వైనాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వివరించింది.
భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ చేయనున్న గగనతల విన్యాసాలు ఈ షోకే హైలైట్‌గా నిలవనున్నాయి. వివిధ రకాల విమానాలను సందర్శకులు దగ్గరి నుంచి చూసేలా స్టాటిక్ డిస్‌ప్లేలు ఏర్పాటు చేయనున్నారు. కేవలం వినోదం, వ్యాపారమే కాదు.. యువతకు ఉపాధి కల్పించేలా ఈవెంట్ ప్లాన్ చేశారు. ఏవియేషన్ రంగంలో కెరీర్‌ను కోరుకునే యువత కోసం ప్రత్యేకంగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. పరిశ్రమ దిగ్గజాలను, నైపుణ్యం కలిగిన యువతను ఒకే వేదికపైకి తీసుకురానున్నారు.
విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేలా సివిల్ ఏవియేషన్ ఇన్నోవేషన్ చాలెంజ్‌ను కూడా నిర్వహించనున్నారు. 20కిపైగా దేశాల నుంచి ప్రతినిధులు, బృందాలు ఈ వేడుకలో పాల్గొననున్నాయి. విమానయాన సంస్థలు, తయారీదారులు, ఎయిర్‌పోర్ట్ డెవలపర్లు, పెట్టుబడిదారులు అంతా ఒకేచోట చేరనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్లోబల్ సీఈవోల ఫోరం, బిజినెస్ మీటింగ్స్ జరగనున్నాయి. డ్రోన్ టెక్నాలజీ, మహిళలకు విమానయాన రంగంలో అవకాశాలు, ఎయిర్ కార్గో వంటి 13 కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి.


