నిర్ణీత ప్లాంట్లకు తరలించాల్సిందే..
ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
నిర్మాణదారులకు షాకిచ్చేలా నిబంధనలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఎక్కడపడితే అక్కడ నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను (సీఅండ్‌డీ వేస్ట్) పారబోసే వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. పర్యావరణ పరిరక్షణ, నాలాల పూడిక నివారణ, నగరాల్లో వరద ముప్పును అరికట్టడమే లక్ష్యంగా అత్యంత కఠినమైన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని తాజాగా సంచలన జీఓ జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీతో పాటు హెచ్‌ఎండీఏ, హెచ్‌ఎంఆర్‌ఎల్, హైడ్రా, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ, ఆర్‌అండ్‌బీ, టీజీఐఐసీ, టీజీఎస్‌పీడీసీఎల్ ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలి.
కొత్త నిబంధనలు ఇలా..
ఇష్టానుసారంగా నిర్మాణ వ్యర్థాలు పారబోస్తే వాహనాలు సీజ్‌తో పాటు భారీ జరిమానాలు విధిస్తారు. రోడ్ల పక్కన, ఖాళీ స్థలాలు, చెరువులు, నాలాలలో వేస్తే భారీ జరిమానాలతో పాటు, ఆ వ్యర్థాల తొలగింపు ఖర్చును సదరు వ్యక్తి లేదా సంస్థ నుంచే రికవరీ చేస్తారు. అక్రమ రవాణా వాహనాలను స్పాట్‌లోనే సీజ్ చేస్తారు. నిబంధనలు అతిక్రమించే బిల్డర్లు, కాంట్రాక్టర్ల పర్మిషన్లు రద్దు చేయడమే కాక, వారిని శాశ్వతంగా బ్లాక్‌లిస్ట్‌లో పెడతారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల విధులకు అడ్డుతగిలితే కఠిన క్రిమినల్ చర్యలు ఉంటాయి.
u ఇకపై భవన నిర్మాణ, లేఅవుట్ లేదా కూల్చివేత అనుమతులు పొందాలంటే బిల్డర్లు కేవలం దరఖాస్తు చేస్తే సరిపోదు. దాంతో పాటు వ్యర్థాలను అక్రమంగా పారబోయబోమని అండర్ టేకింగ్ ఇవ్వాలి.
u వేస్ట్ మేనేజ్‌మెంట్ , యుటిలైజేషన్ ప్లాన్ తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి.
u పర్యావరణ హితాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ పరిధిలో జరిగే అన్ని సివిల్, రోడ్డు మౌలిక వసతుల పనుల్లో కనీసం 10 శాతం నిర్మాణ సామగ్రిని రీసైకిల్ చేసిన వ్యర్థాలతో తయారు చేసిన వాటినే ఉపయోగించాలి.
u రోడ్డు కటింగ్ పనులు, డ్రైనేజీలు, మెట్రో లేదా మౌలిక వసతుల కాంట్రాక్టర్లు పనులు ముగించే లోపు సైట్‌ను పూర్తిగా క్లీన్ చేయాలి.
u ఈ ఉత్తర్వులు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లో ఉన్నాయని, ఈ సరికొత్త నిబంధనల అమలులో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ హెచ్చరించారు. ఏ చిన్న పొరపాటు జరిగినా సంబంధిత నోడల్ అధికారులు, కమిషనర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని జీవోలో స్పష్టం చేశారు.
ఇక్కడే వ్యర్థాలను అప్పగించాలి..
శంషాబాద్ ప్లాంట్ (టోల్‌ఫ్రీ: 18002030033)
తూము కుంట ప్లాంట్ (18002030033)
జీడిమెట్ల ప్లాంట్ (18001201159)
ఫతుల్లాగూడ ప్లాంట్ (18001201159)


