దీపిక కిడ్నాప్‌ కేసులో ఊహించని ట్విస్ట్‌ | Vikarabad Deepika Kidnap Case she Call To Police Says Safe | Sakshi
Sakshi News home page

దీపిక కిడ్నాప్‌ కేసులో ఊహించని ట్విస్ట్‌

Sep 29 2020 1:09 PM | Updated on Sep 29 2020 3:42 PM

Vikarabad Deepika Kidnap Case she Call To Police Says Safe - Sakshi

సాక్షి, రంగారెడ్డి : వికారాబాద్‌లో మూడు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన దీపిక కేసు ఊహించని మలుపు తిరిగింది. గత మూడు రోజులగా ఆమె కోసం ఆరు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపడుతున్న పోలీసులకు యువతి షాకిచ్చింది. తాను ఇష్టపూరితంగానే భర్త అఖిల్‌తో వెళ్లినట్టు పోలీసులకు తెలిపింది. మేరకు మంగళవారం వికారాబాద్‌ పోలీసులకు ఫోన్‌ చేసిన దీపిక.. తాను అఖిల్‌ వద్ద క్షేమంగానే ఉన్నట్లు చెప్పింది. పోలీసుల సూచన మేరకు కాసేపట్లో వీరిద్దరు వికారాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్దకు రానున్నారు. దీంతో దీపిక కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో తెలియాల్సి ఉంది. (మలుపులు తిరుగుతున్న దీపిక కిడ్నాప్‌ కేసు)

వివరాల ప్రకారం.. వికారాబాద్‌కు చెందిన దీపిక, అఖిల్‌ 2016లో ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడం రెండు సంవత్సరాల క్రితం అమ్మాయిని తీసుకొచ్చారు. కుటుంబ సభ్యుల బలవంతం మేరకు అఖిల్‌ నుంచి విడాకులు కోరుతూ దీపిక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే గత (శనివారం) ఇరువురు వికారాబాద్ కోర్టుకు హాజరయ్యారు. అనంతరం అదే రోజు సాయంత్రం దీపిక షాపింగ్‌కు వెళ్లి ఇంటికి వెళ్తుండగా.. ఓ కారులో ముగ్గురు వ్యక్తులు వచ్చి ఆ యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకుని పోయారు. దీనిపై యువతి కుటుంబ సభ్యులు పోలీసులు ఆశ్రయించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గత మూడు రోజులుగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా దీపిక ఫోన్‌ చేయడంతో కథ సుఖాంతమైంది. మరోవైపు తమ కుమార్తెను అఖిల్‌ కిడ్నాప్‌ చేశాడని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement