మలుపులు తిరుగుతున్న దీపిక కిడ్నాప్‌ కేసు

Vikarabad Deepika Kidnap Case Investing By Police - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వికారాబాద్‌కు చెందిన యువతి దీపిక కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్థానికుల సమాచారం ప్రకారం..దీపిక, అఖిల్‌ 2016లో ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడం రెండు సంవత్సరాల క్రితం అమ్మాయిని తీసుకొచ్చారు. కుటుంబ సభ్యుల బలవంతం మేరకు అఖిల్‌ నుంచి విడాకులు కోరుతూ దీపిక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే నిన్న (శనివారం) ఇరువురు వికారాబాద్ కోర్టుకు హాజరయ్యారు. అనంతరం అదే రోజు సాయంత్రం దీపిక షాపింగ్‌కు వెళ్లి ఇంటికి వెళ్తుండగా.. ఓ కారులో ముగ్గురు వ్యక్తులు వచ్చి ఆ యువతిని లాక్కొని పక్కనున్న ఆమె సోదరిని బయటకు తోసి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని దీపిక కుటుంబ సభ్యులు వికారాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డీఎస్పీ సంజీవరావు తమ సిబ్బందితో వెళ్లి సంఘటన స్ధలంతో పరిశీలించారు. దీపికను ఆమె భర్త అఖిలే కిడ్నాప్‌ చేశాడని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు దీపిక ఆచూకీ ఇంతవరకు లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. (వికారాబాద్‌లో కిడ్నాప్‌ కలకలం)

ఈ నేపథ్యంలో అఖిల్‌ తండ్రి మరో విధంగా స్పందించారు. అసలు తన కొడుకు పెళ్లి చేసుకున్నాడనే విషయం ఇప్పటి వరకు తెలీదన్నారు. శనివారం సాయంత్రం తన ఇంటికి పోలీసులు వచ్చిన తర్వాతే తెలిసిందని పేర్కొన్నారు. అప్పటి నుంచి అఖిల్‌కు వరుసగా ఫోన్‌ చేస్తున్నా.. స్విచ్‌ ఆఫ్‌ వస్తుందని తెలిపారు. గతంలో తన కుమారుడు ఒకసారి తన స్నేహితునికి కోర్టులో కనిపించాడని తెలిసి అడిగానని, కానీ సరిగ్గా సమాధానం చెప్పలేదన్నారు. ప్రస్తుతం అఖిల్‌ హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నట్లు వెల్లడించారు. వారాంతంలో ఎప్పుడో ఒక్కసారి ఇంటికి వచ్చి వెళ్తుంటాడని, గత శనివారం కూడా అదే విధంగా వచ్చి వెళ్లాడని చెప్పారు. ఇంతలోనే నిన్న సాయంత్రం ఇంటికి పోలీసులు వచ్చి ఓ యువతిని తన కుమారుడు కిడ్నాప్ చేశాడని చెప్పడంతో షాక్‌కు గురయ్యానని పేర్కొన్నారు.

అయితే దీపిక గురించి పూర్తి వివరాలు వెల్లడించడానికి పోలీసులు, కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. వికారాబాద్‌ సీఐ గురుకుల రాజశేఖర్‌ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి వెళ్లి కిడ్నాప్‌పై స్థానికులను విచారించారు. అనంతరం సీసీ పుటేజీ ద్వారా కారు గురించి ఆరా తీశారు. కారు హైదరాబాద్‌ వైపు వెళ్లిన్నట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇక  ఈ కిడ్నాప్‌ కేసు చివరికి  ఎటువైపు మలుపు తిరుగుతుందో వేచిచూడాలి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top