
షాద్‌నగర్(హైదరాబాద్): ఓవైపు కల్వకుర్తి.. మరో వైపు పాలమూరు అటవీ ప్రాంతం.. ఈ క్రమంలో మావోయిస్టుల చర్యలు.. కదలికలు ఒకప్పుడు కలవరం పుట్టించాయి.. రెండు దశాబ్దాలుగా అలాంటి ఆనవాళ్లు ఏవీ ఇక్కడ కనిపించడం లేదు.. తాజాగా మావోయిస్టు విజయలక్ష్మి అలియాస్ భూమిక ఎన్‌కౌంటర్ ఘటన మరోసారి షాద్‌నగర్‌లో కలకలం రేపింది.
గతంలో ఇలా..
షాద్‌నగర్ నియోజకవర్గానికి ఆనుకొని ఉండే కల్వకుర్తి నియోజకర్గం మొదటి నుంచీ మావోయిస్టుల కార్యాకలాపాలకు కేంద్రం. ఈ క్రమంలో చాలామంది మావోయిస్టులు షాద్‌నగర్‌ను కేంద్రంగా చేసుకొని తమ కార్యాకలాపాలు కొనసాగించే వారని గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. షాద్‌నగర్‌కు సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉండే నల్లమల అటవీ ప్రాంతం సైతం మావోయిస్టులకు అడ్డాగా ఉండేది. అక్కడి నుంచి కూడా ఇక్కడికి తలదాచుకునేందుకు వచ్చే వారని ప్రచారంలో ఉంది.
ఎన్‌కౌంటర్‌లో హతం
ఫరూఖ్‌నగర్ మండలం నేరేళ్ల చెరువు గ్రామానికి చెందిన జంగయ్య అలియాస్ దివాకర్ నల్లగొండ దళంలో చేరి జిల్లా కార్యదర్శిగా పని చేశాడు. 15 ఏళ్ల క్రితం నల్లమల అటవీ ప్రాంతంలోని గోకారం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. 2005లో షాద్‌నగర్ పట్టణానికి చెందిన కానిస్టేబుల్ ప్రకాష్ ను మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో నక్సలైట్లు కాల్చి చంపారు. పదేళ్ల క్రితం కొందుర్గు మండల పరిధిలోని మహదేవ్‌పూర్, టేకులపల్లి గ్రామాల్లో, షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్íÙప్‌లో మావోయిస్టు సానుభూతిపరులను, ఆ తర్వాత కొందుర్గు మండలం ఆగిర్యాల గ్రామంలో మావోయిస్టు మద్దతుదారులను పోలీసులు అరెస్టు చేసిన సంఘటనలు ఉన్నాయి. అప్పట్లో వారి నుంచి విప్లవ సాహిత్య పుస్తకాలను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఇలా తరచూ ఏదో ఒక సంఘటనకు షాద్‌నగర్ వేదికగా మారింది. ఇరవై ఏళ్లుగా మావోయిస్టులకు సంబంధించి ఎలాంటి కదలికలు లేవు.
మరోసారి ఉలికిపాటు
మావోయిస్టుగా పేరు మోసిన విజయలక్ష్మి ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లా సరిహద్దు అబూజ్‌మడ్ అడవుల్లో గత బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. కేశంపేట మండలం వేములనర్వ గ్రామానికి చెందిన ఆమె విద్యార్థి దశలో ఉద్యమాల పట్ల ఆకర్షితు రాలైంది. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న క్రమంలో అజ్ఞాతంలోకి వెళ్లి నక్సలిజం వైపు అడుగులు వేసింది. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
వేములనర్వలో విషాదఛాయలు
కేశంపేట: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో వేములనర్వ కు చెందిన విజయలక్ష్మి (38) మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఉదయం నుంచే గ్రామస్తులు విజయలక్ష్మి తల్లిదండ్రులు సాయిలు గౌడ్, సరస్వతిని పరామర్శించారు. మరోవైపు విజయలక్ష్మి మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకువచ్చేందుకు కుటుంబ సభ్యులు ఆసక్తి చూపకపోవడంతో అంత్యక్రియల్లో జాప్యం ఏర్పడింది. మరోవైపు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) విజయలక్ష్మిపై కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. 2019, 2021లో కేసులను నమోదు చేయగా కొద్దిరోజుల క్రితం వారెంట్ ఇష్యూ చేసినట్టు సమాచారం. ఇంట్లో నుంచి వెళ్లినప్పటి నుంచి విజయలక్ష్మితో సంబంధాలు లేవని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదే విషయమై పంచాయతీ కార్యదర్శి రాతపూర్వకంగా తెలియజేసినట్టు సమాచారం.