పెద్దమందడిలోని రెండు మిల్లుల్లో రూ.12.50 కోట్ల విలువైన ధాన్యం మాయం
వనపర్తి: జిల్లాలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక దాడులతో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారుల పర్యవేక్షణ లోపం ఈ ఘటనతో కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. విజిలెన్స్ ఎస్పీ ఆనంద్‌కుమార్‌కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం డీఎస్పీ శ్రీనివాస్ నేతృత్వంలో విజిలెన్స్ దాడులు కొనసాగాయి.
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల శివారులోని చాముండి మిల్లులో 97 వేల బస్తాలు, వారాహి మిల్లులో 37 వేల ధాన్యం బస్తాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు విజిలెన్స్ డీఎస్పీ వెల్లడించారు. మిల్లుల్లో ఉండాల్సిన ధాన్యం కంటే రూ.12.50 కోట్ల విలువైన ధాన్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించామని చెప్పారు.
ఈ విషయాన్ని రాష్ట్రస్థాయి అధికారులకు నివేదించనున్నట్లు విజిలెన్స్ తహసీల్దార్ రాజశేఖర్, సీఐ గణేశ్, డీసీటీఓ సురేశ్ తెలిపారు. రెండు మిల్లుల్లో ధాన్యం బస్తాల లెక్కింపు సమయంలో వనపర్తి డీఎస్‌ఓ, డీటీ ఎన్‌ఫోర్స్‌మెంట్ తదితరులున్నారు.
కలెక్టర్ తనిఖీ చేసిన మరునాడే..
ప్రస్తుత వానాకాలం వరి ధాన్యం కేటాయింపుల్లో భాగంగా ఆయా మిల్లులకు ధాన్యం కేటాయింపుతో పాటు ఇతర అంశాలపై కలెక్టర్ ఆదర్శ్ సురభి మంగళవారం తనిఖీ చేశారు. మరునాడే విజిలెన్స్ అధికారుల బృందం దాడులు నిర్వహించి రూ.కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.


