సాక్షి, హైదరాబాద్: అమెరికా– ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య యుద్ధం అన్నింటి కన్నా పర్యాటక రంగాన్ని దెబ్బతీయనుంది. సమ్మర్ టూర్లపై ప్రభావం పడుతుందని ట్రావెల్ ఆపరేటర్లు అంటున్నారు. వేసవిలో మన దేశంలో పాఠశాలలకు సుదీర్ఘ సెలవులు ఇస్తారు కాబట్టి కుటుంబ సమేత విహారాల లీజర్ ట్రావెల్‌కు ఇది సరైన సమయంగా పర్యా టక ప్రేమికులు భావిస్తారు. కొత్త జంటల హనీమూన్స్‌కు కూడా ఇది సీజన్ లాంటిదే. ఇప్పటికే చాలా మంది తమ ట్రావెల్ ప్లాన్స్‌ను అమలులోకి పెట్టారు. విదేశాలకు, సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు నెలల ముందుగానే ప్రయాణ టికెట్లతో పాటు ఇతరత్రా బుకింగ్స్ కూడా చేసుకున్నారు.
రద్దులు, వాయిదాలు మొదలు..
విమానయాన సంస్థలు పశ్చిమాసియాకు సేవలు నిలిపివేశాయి లేదా దారి మళ్లించాయి, ఇది గల్ఫ్ వెళ్లేవారికి మాత్రమే కాక దుబాయ్ వంటి ప్రధాన కేంద్రాల ద్వారా అమెరికా వెళ్లేవారిని ప్రభావితం చేసింది. ప్రస్తుతం ప్రణాళికలను వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నారని మేక్ మై ట్రిప్ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా..‘సాధారణ పరిస్థితుల్లో.. పాఠశాల సెలవులు కుటుంబ ప్రయాణాల వల్ల వార్షిక లీజర్ అవుట్»ౌండ్ ట్రాఫిక్ లో 30–35 శాతం పెరుగుదల ఉంటుంది’‘ అని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (ఐఏటివో) అధ్యక్షుడు రవి గోసైన్ అంటున్నారు. 2025లో 3.27 కోట్ల మంది భారతీయులు విదేశాలకు ప్రయాణించగా వేసవి లీజర్ ట్రావెల్ అంతర్జాతీయ పర్యటనలలో 43.5 శాతం వాటాతో అతిపెద్ద చోదకంగా నిలిచింది.
విహారాలకు విఘాతమే...
‘భారత్ నుంచి యూరప్, అమెరికాకు విమానాలను అనుసంధానించడానికి దుబాయ్ నాడీ కేంద్రం. ఆ ప్రయాణాలను ప్లాన్ చేసే ఎవరైనా సరే ప్రస్తుత పరిస్థితుల కారణంగా ప్రభావితమవుతారు’ అని ట్రావెల్ ప్లాట్‌ఫామ్ పిక్యూర్ట్రైల్ సహ వ్యవస్థాపకుడు హరి గణపతి అంటున్నారు. భారతీయులకు మధ్యప్రాచ్యం కీలకమైన ప్రయాణ కారిడార్. పర్యాటక మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, 2025లో భారతీయులు సందర్శించిన టాప్ 20 దేశాలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, థాయిలాండ్, యునైటెడ్ స్టేట్స్, సింగపూర్ ఉన్నాయి. అదే సమయంలో, కొంతమంది ప్రయాణికులు అంతగా అనిశ్చితి లేని గమ్యస్థానాల వైపు తమ ప్రణాళికలను మారుస్తున్నారు. పశి్చమాసియాలో అనిశ్చితి మధ్య భారతీయ ప్రయాణికులు సింగపూర్, జపాన్, వియత్నాం, ఫిలిప్పీ¯న్స్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు, మారిషస్ వంటి ప్రత్యామ్నాయాలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు.


