తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు | Unseasonal Rains Wreak Havoc in Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

May 7 2026 8:42 PM | Updated on May 7 2026 9:29 PM

Unseasonal Rains Wreak Havoc in Telangana

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షాలు కురిశాయి. జగిత్యాల బీట్ బజార్ వద్ద గంటపాటు కురిసిన భారీ వర్షంతో మక్కలు పూర్తిగా తడిసిముద్దయ్యాయి. దీంతో రైతులు ఆందోళన చేపట్టారు. 20 రోజుల క్రితం తీసుకొచ్చిన మొక్కలు ఇప్పటికీ కొనుగోలు చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 

అధికారుల నిర్లక్ష్యంపై రైతులు మండిపడ్డారు. జగిత్యాల-నిజామాబాద్ జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. ఆందోళనతో భారీగా స్తంభించింది ట్రాఫిక్. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు, జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసింది.

నిజామాబాద్ జిల్లాలో పలుచోట్ల వర్షం కురిసింది. బాల్కొండ, మోర్తాడ్, ఏర్గట్ల, వేల్పూరు, ఆర్మూర్,ధర్పల్లి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన‍్యం తడిసింది. రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

కోరుట్ల నియోజకవర్గంతో పాటు కథలాపూర్, మేడిపల్లి మండలాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. మెట్ పల్లి మార్కెట్ యార్డులో భారీ వర్షంతో మొక్కజొన్న, ధాన్యం తడిచింది. పలు గ్రామాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యం, మొక్కజొన్నలోకి నీరు చేరింది. పలు ప్రాంతాల్లో మామిడి నేలరాలింది.

కథలాపూర్ మండలం తక్కళ్లపల్లి శివారులో భారీ ఈదురు గాలులతో వెంకటేశ్వర రైసు మిల్ యంత్ర భాగాలు కూలడంతో భారీ నష్టం వాటిల్లింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం మండలాలలో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. భైంసా మండలం మాటేగాం గ్రామం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. మొక్కజొన్న కొనుగోలులో జాప్యంతో అకాల వర్షం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని నిరసన తెలిపారు.

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని కంచుమహల్, కొండాపూర్, ముంబాజీపేట్, భవానీపేట్, జల్దిపల్లి, రాంపూర్ భారీ వర్షం కురిసింది. గ్రామాలలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షంతో.. ఆరబోసిన ధాన్యం నీటిలో తడిసి ముద్దయింది.

ఏపీకి వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విదర్భ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ద్రోణి కొనసాగుతోంది. ఉత్తర కోస్తా, రాయలసీమలో తేలికపాటి వానలు పడుతున్నాయి. దక్షిణ కోస్తాలో ఎండ తీవ్రత పెరుగుతోంది. వచ్చే వారం బంగాలాఖతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది తుఫానుగా మారే అవకాశం ఉన్నట్టు ఐఎండీ అంచనా వేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement