రుచుల భారతాన్ని ప్రతిబింబించే మ్యాప్ కోసం కసరత్తు
ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో పరిశోధన
దేశంలోని స్థానిక రుచుల వివరాలతో రూపొందుతున్న భారత్ టేస్ట్ అట్లాస్
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు ఇడ్లీ–సాంబార్, ఫిల్టర్ కాఫీకి ఫేమస్.. హైదరాబాద్ పేరు చెప్పగానే నోరూరించే దమ్ బిర్యానీ గుర్తొస్తుంది. ఇలా దేశంలోని వేర్వేరు ప్రాంతాల ప్రత్యేక రుచులు, వంటకాలు, విభిన్న తయారీ పద్ధతులకు డిజిటల్ రూపం ఇచ్చేందుకు భాగ్యనగరం వేదికగా కసరత్తు జరుగుతోంది. ఆయా వంటకాల్లోని పదార్థాల కల యిక, వంట విధానం సహా ప్రాంతానికో రుచి కలిగిన భారతీయ రుచులను సాంకేతికంగా గుర్తించేందుకు హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలోని సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో పరిశోధన సాగుతోంది. ఇండియన్ ఫుడ్ మ్యాప్ తయారీ లక్ష్యంగా ప్రొఫెసర్ సీవీ జవహర్ సారథ్యంలో జరుగుతున్న ఈ అధ్యయనంలో కంప్యూటర్ విజన్, ఏఐ సాంకేతికతలను ఉపయోగించి భారతీయ ఆహార ప్రత్యేకతలను పరిశోధక బృందం విశ్లేషిస్తోంది.
థాళీ... భళీ...
ఈ ప్రాజెక్టులో భాగంగా పరిశోధకులు తొలుత భారతీయ థాళీ’పై అధ్యయనం ప్రారంభించారు. సాధారణంగా భారతీయ భోజనంలో అన్నం, పప్పు, కూరలు, రొట్టెలు, పెరుగు, పచ్చళ్లు వంటి అనేక పదార్థాలు కలిసిపోవడం వల్ల వాటి పోషక విలువలను గుర్తించడం ప్రస్తుత యాప్‌లకు కష్టమవుతోంది. పాశ్చాత్య దేశాల ఆహారాన్ని గుర్తించేందుకు తయారైన చాలా ఫుడ్ ట్రాకింగ్ యాప్‌లు భారతీయ వంటకాల వైవిధ్యాన్ని సరిగా అర్థం చేసుకోవడం లేదని పరిశోధకులు గుర్తించారు. దీనికి పరిష్కారంగా జీరో–షాట్ ఏఐ సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు. ఈ సాంకేతికత కొత్త వంటకాలను ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండానే గుర్తించి, విశ్లేషిస్తుంది.
బిర్యానీపై స్పెషల్ స్టడీ
హైదరాబాదీ, అవధీ, అంబూర్, కోల్‌కతా వంటి బిర్యానీ రకాల్లో ఉపయోగించే మసాలాలు, వంట దశలు, పదార్థాల మార్పులను ఏఐ ప్రత్యేకంగా విశ్లేషిస్తోంది. ఈ ప్రాజెక్టు కేలరీలు లెక్కించే సాధనంగా మాత్రమే కాకుండా భారతీయ ఆహార సంస్కృతిని డిజిటల్ రూపంలో భద్రపరిచే ప్రయత్నంగా కూడా మారనుంది. ప్రస్తుతం ఈ సిస్టమ్ ఓవర్‌హెడ్ కెమెరా సహాయంతో పనిచేస్తుండగా భవిష్యత్తులో మొబైల్ యాప్ రూపంలో అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ప్రయత్నాలు చేస్తున్నారు. ఫోన్ కెమెరాతో భోజనం ఫొటో తీస్తే అందులోని పదార్థాలు, వాటి పరిమాణం, పోషక విలువలను కూడా ఏఐ అంచనా వేస్తుందని బృందం చెబుతోంది.
లాభాలివీ..
⇒ ఈ ప్రాజెక్టు ద్వారా వినియోగదారులు దేశ ఇంటరాక్టివ్ మ్యాప్‌ను అన్వేషిస్తూ వివిధ ప్రాంతాల సంప్రదాయ వంటకాలను తెలుసుకోగలరు.
⇒ ప్రతి వంటకం మూలాలు, పదార్థాలు, సాంస్కృతిక ప్రాధాన్యం, తయారీ విధానంతోపాటు వాటిని అందించే రెస్టారెంట్ల గురించి కూడా సమాచారం పొందగలరు.
⇒ కొత్త వంటకాలను తెలుసుకోవాలనుకునే ఆహార ప్రియులకు ఇది దోహదపడటంతోపాటు పర్యాటకులకు అసలైన స్థానిక ఆహార అనుభవాలను కనుగొనడంలో సహాయపడుతుంది.
⇒ భారతీయ ఆహార వారసత్వంపై ఆసక్తి ఉన్న పరిశోధకులు, విద్యార్థులు, సాంస్కృతిక సంస్థలకు ఇది ఉపయుక్తమైన వనరుగా ఉంటుంది.
ఏఐ ఆధారిత పరిష్కారాలకు దోహదం
సమాచార సేకరణ, వర్గీకరణ కోసం ఏఐ సాధనాలను వినియోగించి అనంతరం ధ్రువీకరణ, భౌగోళిక మ్యాపింగ్ కోసం ప్రత్యేక విధానాలను అభివృద్ధి చేశాం. దీంతో వినియోగదారులకు సులభంగా ఉపయోగపడే ఇంటరాక్టివ్ వేదికను రూపొందించగలిగాం. ఈ డేటా వల్ల రుచులు, పోషకాలు, వినూత్న పద్ధతులపై సాంకేతిక విశ్లేషణ సాధ్యమవుతుంది. దీని ద్వారా భారతీయ ఆహార రంగంలో ఏఐ ఆధారిత పరిష్కారాలు అభివృద్ధి చెందుతాయి. వంటకాల్లోని వైవిధ్యాలను, వంటకాల పరిణామ క్రమాన్ని కూడా చేర్చాలని భావిస్తున్నాం.
– ప్రొఫెసర్ సీవీ జవహర్


