కార్య‘కర్తవ్య బోధన’

Union Ministers BJP CMs And Leaders Tour Across The Telangana - Sakshi

రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర మంత్రులు, బీజేపీ సీఎంలు, నేతల పర్యటన 

స్థానిక బీజేపీ నేతలు, అనుబంధ విభాగాల కార్యకర్తలతో సమావేశాలు 

కేంద్ర పథకాలను వివరిస్తూ.. పార్టీ బలోపేతానికి సూచనలు చేస్తూ.. 

పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచేలా కార్యక్రమాలు 

అక్కడక్కడా స్థానికంగా ప్రజలతో భేటీలు 

సాక్షి నెట్‌వర్క్‌: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ సీనియర్లు విస్తతంగా పర్యటిస్తున్నారు. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల అధ్యక్షులు, ఎంపీలు, ఇతర కీలక నేతలు పట్టణాలు, గ్రామాల్లో తిరుగుతూ కార్యకర్తల ఇళ్లలో భోజనం చేస్తూ.. బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు.

పార్టీ పదాధికారులు, వివిధ మోర్చాలు, శక్తి కేంద్రాల సమావేశాల్లో పాల్గొని దిశా నిర్దేశం చేస్తున్నారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ.. మరోవైపు పార్టీ బలోపేతం కోసం సూచనలు, సలహాలు ఇస్తూ కలియదిరుగుతున్నారు. స్థానికంగా ప్రజలు, విద్యార్థులు, రైతులతో మాట్లాడి వారి సమస్యలపై పోరాటం చేస్తామని హామీ ఇస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పాలనలో విఫలమైందని.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని చెప్తున్నారు. 

ఉమ్మడి కరీంనగర్‌లో.. 
కేంద్ర మంత్రి వీరేందర్‌కుమార్‌ కటక్‌ శుక్రవారం సిరిసిల్లలో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన సమావేశంలో పాల్గొని సూచనలు, సలహాలు ఇచ్చా రు. రామడుగు మండలం వెదిరలోని దళితకాలనీలో గుడువందల నర్సయ్య ఇంట్లో అల్పాహారం తీసు కున్నారు. బీజేపీ రాజస్థాన్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే సతీష్‌ పునియా కరీంనగర్‌లో పార్టీ అనుబంధ మోర్చా లు, కార్యకర్తలతో భేటీ అయ్యారు.

బూత్‌ స్థాయి నుండి చేపట్టాల్సిన కార్యక్రమా లపై సూచనలు చేశారు. కొత్తపల్లిలో దళిత మోర్చా మండల అధ్యక్షుడు నలువాల మహేశ్‌ ఇంట్లో భోజనం చేశారు. కేంద్ర మంత్రి మహేంద్రనాథ్‌ పాండే జమ్మికుంటలో ఆవాస విద్యా లయాన్ని సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. పశ్చిమబెంగాల్‌ ఎంపీ జయంత్‌ కుమార్‌ రాయ్‌ మానకొండూరులో పర్యటించారు. ధర్మపురిలో కేంద్ర మంత్రి శ్రీపాదనాయక్, మంథనిలో చత్తీస్‌గఢ్‌ ఎమ్మెల్యే అజయ్‌ చంద్రకర్, రామగుండం లో బిహార్‌ ఎంపీ గోపాల్‌జీ ఠాగూ ర్, జగిత్యాలలో మనోజ్‌ తివారీ, కోరుట్లలో అనిర్బన్‌ గంగూలీ పర్యటించి.. నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. 

ఉమ్మడి ఆదిలాబాద్‌లో.. 
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మంచిర్యాలలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణదేవి విమర్శించారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడలో కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్, ఆదిలాబాద్‌లో త్రిపుర మాజీ సీఎం విప్లవ్‌కుమార్‌ స్థానిక నాయకులతో కలిసి మార్నింగ్‌ వాక్‌ చేశారు. కాగజ్‌నగర్‌లో మణిపూర్‌ రాష్ట్ర బీజేపీ చీఫ్‌ శారద దేవి, చెన్నూరులో ఎంపీ అజయ్‌ టాంటా, బెల్లంపల్లిలో జమ్మూకాశ్మీర్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి కవీందర్‌గుప్తా, నిర్మల్‌లో ఎమ్మెల్సీ నావల్‌ కిశోర్‌యాదవ్, ఖానాపూర్‌లో ఎంపీ హీనాకుమార్, ఆసిఫాబాద్‌లో డయ్యూడామన్‌ బీజేపీ అధ్యక్షుడు దీపేశ్‌ సోండే, ముథోల్‌లో కేంద్ర మాజీ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్‌ రాథోడ్‌ కార్యకర్తలతో సమావేశమయ్యారు. 

ఉమ్మడి నిజామాబాద్‌లో.. 
కేసీఆర్‌ కుటుంబం రాష్ట్ర నిధులను ఏటీఎంలా వాడుకుంటోందని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై నిజామాబాద్‌లో ఆరోపించారు. ఎల్లారెడ్డిలో గుజరాత్‌ ఎంపీ పార్తీబెన్, జుక్కల్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు విశాల్‌ జోలె, బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్‌లో బీజేపీ సిక్కిం అధ్యక్షుడు దాల్‌ బహదూర్‌ చౌహాన్, మోపాల్‌ మండలం నర్సింగ్‌పల్లిలో కేంద్ర మంత్రి ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే పార్టీ నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. బీజేపీ ఐటీ సెల్‌ జాతీయ కన్వీనర్‌ అమిత్‌ మాలవీయ కామారెడ్డిలో పర్యటించి.. కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.  

ఉమ్మడి ఖమ్మంలో.. 
ఇల్లెందు, టేకులపల్లిలో బీజేపీ నేత లత ఉసెండి, బూర్గంపాడులో బీజేపీ కేరళ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్, దమ్మపేటలో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర అధ్యక్షుడు విష్ణుదేవ్‌ సాయి, సత్తుపల్లి, పెనుబల్లి మండలాల్లో బీజేపీ పశ్చిమ బెంగాల్‌ ఎమ్మెల్యే ముకుత్‌ అధికారి, ఖమ్మం రూరల్‌ మండలంలో ఎంపీ లక్ష్మీకాంత్‌ బాజ్‌పాయ్, ఖమ్మం, రఘునాథపాలెం మండలాల్లో బీజేపీ జాతీ య అధికార ప్రతినిధి గోపాలకృష్ణ అగర్వాల్, వైరాలో గుజరాత్‌ ఎంపీ రమేలా బెన్, మధిరలో మధ్యప్రదేశ్‌ ఎంపీ సంధ్యారాయ్‌ పర్యటించారు. ఎక్కడికక్కడ స మావేశాలు నిర్వహించి, బీజేపీ కార్యకర్తలకు పార్టీ ఉ ద్దేశాలు, ఏం చేయాలనే అంశంపై దిశానిర్దేశం చేశారు. 

ఉమ్మడి రంగారెడ్డిలో 
మహేశ్వరం నియోజకవర్గంలో కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్‌ జ్యోతి పర్యటించి స్థానిక నేతలతో మాట్లాడారు. ఫరూఖ్‌నగర్‌ మండలంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఆర్‌పీ సింగ్, ఆమనగల్‌లో ఒడిశా బీజేపీ అధ్యక్షుడు సమీర్‌ మహంతి, కొడంగల్‌లో కర్నాటక మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సంగప్ప, పరిగిలో మాజీ ఎంపీ అనుపమా హజ్రా పర్యటించారు. కార్యకర్తలతో సమావేశమై నియోజకవర్గాల్లో పరిస్థితిని సమీక్షించారు. 

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో.. 
కేంద్ర మంత్రి సంజయ్‌కుమార్‌ బాల్యాన్‌ మెదక్‌లో మత్స్యకారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల కోసం అమలు చేస్తున్న పథకాల్లో 60 శాతం కేంద్రం నిధులేనన్నారు. నర్సాపూర్‌ నియోజకవర్గంలో ఎంపీ శివప్రతాప్‌ శుక్లా.. సిద్దిపేటలో ఎంపీ అపరాజితా సారంగి, గజ్వేల్‌లో జార్ఖండ్‌ బీజేపీ అధ్యక్షుడు దీపక్‌ ప్రకాశ్, దుబ్బాకలో మాజీ గవర్నర్‌ రాజశేఖరన్, సంగారెడ్డిలో రాజస్థాన్‌ అసెంబ్లీ బీజేపీపక్ష నేత గులాబ్‌చంద్‌ కటారియా, జహీరాబాద్‌లో కర్నాటక ఎంపీ ఉమేశ్‌ జాదవ్‌ పర్యటించి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. 

ఉమ్మడి నల్లగొండలో.. 
సూర్యాపేటలో కేంద్ర మంత్రి వీకే సింగ్‌ పర్యటించారు. వీర జవాన్లు గోపయ్యచారి, సంతోష్‌బాబు చిత్రపటాల వద్ద నివాళులు అర్పించి పార్టీ శ్రేణులతో భేటీ అయ్యారు. నల్లగొండలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సుధాన్షు త్రివేది, నాగార్జునసాగర్‌లో కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ చతుర్వేది, కోదాడలో ఢిల్లీ అసెంబ్లీ ప్రతిపక్ష నేత శ్రీరామ్‌వీర్‌ సింగ్‌ బిదూరి, తుంగతుర్తిలో హరియాణా ఎంపీ సునీత దుంగల్, భువనగిరిలో జమ్ముకశ్మీర్‌ మాజీ మంత్రి ప్రియాసేథ్, ఆలేరులో డార్జిలింగ్‌ ఎంపీ రాజు బిస్తా పార్టీ నేతలు, కార్యకర్తలతో భేటీ అయి పరిస్థితిని సమీక్షించారు.

తెలంగాణ మద్యం, డ్రగ్స్, గంజాయి రాష్ట్రంగా మారిందని, టీఆర్‌ఎస్‌ రావణ పాలనకు ముగింపు పలికి, రామలక్ష్మణ రాజ్యం తెస్తామని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఐపీఎస్‌ అధికారి భారతి ఘోష్‌ మిర్యాలగూడలో పేర్కొన్నారు. నకిరేకల్‌ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి ప్రతిమ భౌమిక్‌.. దేవరకొండలో కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ మీనా జాస్కర్‌.. మునుగోడులో కేరళ రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్‌ పీకే కృష్ణదాస్‌ పర్యటించారు. ఎంపీ రాజ్‌కుమార్‌ చాహర్‌ హుజూర్‌నగర్‌లో రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. 

ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో.. 
మహబూబ్‌నగర్‌లో ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం తీరత్‌సింగ్‌ రావత్‌ వివిధ మోర్చాల నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇక జడ్చర్లలో గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపానీ, దేవరకద్రలో కర్ణాటక మాజీ సీఎం జగదీశ్‌షెట్టర్, నారాయణపేటలో విశ్వజిత్‌ రాణే, గద్వాలలో జమ్మూకశ్మీర్‌కు చెందిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆశిష్‌సూద్, అలంపూర్‌లో బిహార్‌ ఎమ్మెల్యే ప్రేమ్‌కుమార్, వనపర్తిలో యూపీ నేత రాజేశ్‌ అగర్వాల్, నాగర్‌కర్నూల్‌లో గుజరాత్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్‌భాయ్‌ పటేల్, కొల్లాపూర్‌లో తమిళనాడు మాజీ మంత్రి రాధాకృష్ణన్, కల్వకుర్తిలో ఒడిశా బీజేపీ అధ్యక్షుడు సమీర్‌ హేమంత్, అచ్చంపేటలో జమ్మూకశ్మీర్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి నిర్మల్‌ సింగ్‌ పర్యటించా రు. మక్తల్‌లో కర్ణాటక మాజీ  సదానందగౌడ కార్యకర్తలతో సమావేశమయ్యారు. 

ఉమ్మడి వరంగల్‌లో.. 
మహబూబాబాద్‌ నియోజకవర్గం కేసముద్రంలో జార్ఖండ్‌ మాజీ సీఎం బాబులాల్‌ మరాండి బీజేపీ శ్రేణులతో సమావేశమయ్యారు. ములుగులో ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం రమేశ్‌ పోఖ్రియాల్, నర్సంపేటలో యూపీ మంత్రి అనిల్‌ రాజ్‌భర్, భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్లపల్లిలో బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు ఆదేశ్‌ కుమార్‌ గుప్తా, హనుమకొండలో ఎంపీ ఓం ప్రకాష్‌ మాధుర్, స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గం ధర్మసాగర్‌లో బీజేపీ జాతీయ కార్యదర్శి ఆశా లక్రా, పాలకుర్తిలో మహారాష్ట్ర నేత లదారామ్, భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో పశ్చిమ బెంగాల్‌ ఎంపీ దేవశ్రీ చౌదరి, జనగామలో బీజేపీ జాతీయ పార్లమెంటరీ వ్యవహారాల కార్యదర్శి సుబ్రమణ్యం తదితరులు పర్యటించారు. డోర్నకల్‌ కూరగాయల మార్కెట్లో వ్యాపారులతో త్రిపుర ఎంపీ రాబాటి మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top