ప్రచారంలో సీఎం రేవంత్ దిగజారి మాట్లాడుతున్నారు
బీఆర్‌ఎస్‌తో కలసి పనిచేయం
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే అవగాహన ఉన్నట్టుంది
బీజేపీ గెలవకూడదని ఎంఐఎం కుట్ర చేస్తోంది.. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ‘మీట్ ద ప్రెస్’లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రభుత్వంపై రెఫరెండంగా భావించడం లేదని, అయితే అక్కడ గెలవబోయేది మాత్రం బీజేపీయే అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే సీట్లకే పరిమితమైన బీజేపీ, లోక్‌సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌తో సమానంగా 8 ఎంపీ సీట్లు గెలిచిందని అన్నారు. గతంలో దుబ్బాక, హుజూరాబాద్ ఆ తర్వాత మునుగోడులో జరిగిన ఉప ఎన్నికల తీరు తెలిసిందేనన్నారు.
ఇలా ఒక్కో సందర్భంలో ఒక రాజకీయవాతావరణం ఉంటుందని, దానికి తగ్గట్టుగా ప్రజలు ఓట్లు వేస్తారని పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీ కార్యకపాలాపాలు లేవని, ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిని కూడా నియమించలేదని, అయితే ఎన్డీఏ భాగస్వామిగా బీజేపీకే మద్దతు ఇస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారని కిషన్‌రెడ్డి తెలిపారు. బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఆయన టీడీపీ ముఖ్య నాయకులకు చెప్పారని వెల్లడించారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లతో బీజేపీ ఎప్పుడూ కలసి పోటీచేయలేదని, భవిష్యత్‌లోనూ బీఆర్‌ఎస్‌తో కలసి పనిచేసే అవకాశమే లేదని స్పష్టంచేశారు. అయితే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఢిల్లీ స్థాయిలో అవగాహన కుదిరినట్టు స్పష్టమవుతోందన్నారు. ఎంఐఎంను కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు పెంచిపోíÙంచాయని, రాష్ట్రంలో మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో బీజేపీ గెలవకూడదని ఎంఐఎం కుట్ర చేస్తోందని ఆరోపించారు. గురువారం ‘మీట్ ద ప్రెస్’కార్యక్రమం సందర్భంగా హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు ఎస్. విజయ్‌కుమార్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి రమేశ్ వరికుప్పల కిషన్‌రెడ్డికి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సకల సమస్యలకు ఫ్రీబస్ ఒక్కటే పరిష్కారం అన్నట్టుగా మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ చెప్పిన 6 గ్యారంటీలు, 421 సబ్ గ్యారంటీల అమలు గురించి ఎక్కడా రేవంత్ ప్రస్తావించడం లేదన్నారు. తనపై వ్యక్తిగత విమర్శలకే పరిమితమైన రేవంత్‌రెడ్డి, కేవలం మజ్లిస్ మెప్పు పొందడం కోసమే పని చేస్తున్నారన్నాని ధ్వజమెత్తారు.
రెండేళ్లలో ఎన్ని హామీలు అమలు చేశారు?
గత 12 ఏళ్లలో గ్రామ పంచాయతీలకు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం ఇచ్చిన, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేసిన నిధులపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ప్రకటన చేయాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రెండేళ్లలో ఎన్ని హామీలు అమలు చేశారో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలన్నారు. ‘జాబ్ కేలెండర్ ఎక్కడ? మహిళలకు ఇస్తామన్న రూ.రెండున్నరవేల సహాయం ఎక్కడ? పావలా వడ్డీ రుణాలు, తులం బంగారం హామీ ఎక్కడ మాయమైంది? నిరుద్యోగులకు ఇస్తామన్న రూ.4 వేల నిరుద్యోగ భృతి ఏమైంది?’అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.
‘హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తోంది, ముఖ్యంగా ఆర్.ఆర్.ఆర్. మొదటి దశ నిర్మాణానికి రూ.15,627 కోట్ల అంచనాతో డీపీఆర్ తయారైంది. కేంద్ర కేబినెట్ దీనిని త్వరలో ఆమోదించనుంది. ఫ్లై ఓవర్లు/ఎలివేటెడ్ కారిడార్‌లు, అంబర్‌పేట ఫ్లైఓవర్లకు రూ. 410 కోట్లు, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌కు రూ.627 కోట్లు, ఆరాంఘర్ 6–లేన్ రోడ్డుకు రూ.387 కోట్లు, కూకట్‌పల్లి – బీహెచ్‌ఈఎల్ ఫ్లైఓవర్‌కు రూ.136 కోట్లు కేటాయించాం’అని తెలిపారు.


