
హన్మకొండ జిల్లా : నాలుగు దశాబ్దాల ఓరుగల‍్లు వాసుల కల సాకారమైందన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. కాజీపేట రైల్వేస్టేషన్‌కు సంబంధించి కోచ్‌ల తయారీ ఫ్యాక్టరీ, వ్యాగన్ తయారీ, ఓవర్ హాలింగ్ పనులు జరుగుతున్న క్రమంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్.. ఈరోజు(జూన్ 19) కాజీపేటలో పర్యటించారు.
అక్కడ జరుగుతున్న పనులను కిషన్‌రెడ్డితో కిలిసి పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ..‘కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఎన్నో ఏళ్ల కళ. ప్రధాని మోదీ ఆ కలను సాకారం చేశారు. డిసెంబర్ వరకు సివిల్ కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తి అవుతుంది. 2026లో మాన్యుఫాక్చరింగ్ మొదలవుతుంది.
ఇంజన్లు, బోగీలు, మెట్రో ట్రైన్స్ తయారీ జరుగుతుంది. అతి పెద్ద మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌గా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నిలుస్తుంది. భారత్ లోనే అతిపెద్ద మెగా మ్యాన్ ఫ్యాక్టరీగా కాజిపేట్‌ను రూపొందిస్తున్నాం.. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో మరింత అభివృద్ధి చేస్తాం’ అని అశ్విని వైష్ణవ్ తెలిపారు.
‘40 ఏళ్ల ఓరుగల్లు వాసుల కల సాకారమైంది’
40 ఏళ్ల ఓరుగల్లు వాసుల కల సాకారమైందన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. ‘ వ్యాగన్ తయారీ, కోచ్‌ల తయారీ, ఓవర్ హాలింగ్ మూడు యూనిట్లు మంజూరు చేశాం. మూడువలే మందికి నేరుగా ఉపాధి కలుగుతుంది. ఓరుగల్లు అభివృద్ధి కోసం కేంద్రం ఎన్నో నిధులు ఇచ్చింది. మోదీ గ్యారంటీ అంటే తప్పకుండా నెరవేరతుంది.
వేయి స్తంభాల మంటపం, రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశాము.త్వరలో వరంగల్‌కు ఎయిర్‌పోర్ట్ వస్తుంది. వరంగల్‌కు మోదీ ఏం ఇచ్చారో.. వరంగల్‌కు వచ్చి చూసి మాట్లాడాలి. తెలంగాణ వ్యాప్తంగా 40 రైల్వే స్టేషన్స్ అభివృద్ధి చేశాం. మరిన్ని రైల్వే లైన్స్ అభివృద్ధికి పనులు చేస్తున్నాం. వరంగల్ అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి పట్ల బీజేపీ కమిట్మెంట్‌తో ఉంది. స్థానికంగా భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం, కలెక్టర్ సిఫార్సు చేస్తే ఉద్యోగాలు కల్పిస్తాం’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.