ఎక్కడా విద్యుత్ వైర్లు కనబడకుండా చర్యలు
రూ.14 వేల కోట్లతో 16 వేల కి.మీ మేర పనులు
ఐదేళ్లలో పూర్తయ్యేలా డిస్కం ప్రతిపాదనలు
హైదరాబాద్ మహానగరం ఇక వైర్‌లెస్ సిటీగా అవతరించబోతోంది. నెత్తిన వేలాడుతూ తరచూ విద్యుత్ ప్రమాదాలకు కారణమవుతున్న ఓవర్‌హెడ్ (ఓహెచ్) విద్యుత్ లైన్ల స్థానంలో ఇక భూగర్భ విద్యుత్ లైన్లు (యూజీ కేబుల్స్) వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. రీవ్యాంప్డ్ డి్రస్టిబ్యూషన్ సెక్టార్ స్కీం (ఆర్‌డీఎస్‌ఎస్) పథకంలో భాగంగా ఈ పనులు చేయనుంది.
నగరంలో ప్రస్తుతం ఉన్న 3,725 కిలోమీటర్ల 33 కేవీ ఓహెచ్ లైన్ల స్థానంలో కనీసం 2 వేల కిలోమీటర్లు, 21,634 కిలోమీటర్ల 11 కేవీ ఓహెచ్ లైన్ల స్థానంలో కనీసం 14 వేల కిలోమీటర్లు ‘హారిజంటల్ డైరెక్షన్ డ్రిల్లింగ్ సిస్టం’లో ఈ కేబుళ్లను (16 వేల కిలోమీటర్లకు కనీసం రూ.14 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా) అమర్చాలని నిర్ణయించింది. తొలి దశలో ఔటర్ రింగ్‌రోడ్డుకు అటు ఇటుగా విస్తరించి ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు సహా కొత్తగా 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ పనులు చేపట్టాలని భావిస్తోంది. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని అధికారిక బృందం బెంగళూరు సహా పలు నగరాల్లో పర్యటించి, అధ్య యనం చేసింది. ఇందుకు ఏటా కనీసం రూ.మూడు వేల కోట్ల చొప్పున కేటాయించి, వచ్చే ఐదేళ్లలో మొత్తం పనులు పూర్తి చేయాలని యోచిస్తోంది.

వచ్చే ఐదేళ్లలో వైర్‌లెస్ సిటీగా..
పాతనగరానికే కాదు కొత్తగా పుట్టుకొచి్చన సైబర్‌సిటీలోనూ బ్లూ ప్రింట్ లేకపోవడంతో అడ్డదిడ్డమైన నిర్మాణాలతో విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్థంగా తయారైంది. హైటెన్షన్ విద్యుత్ లైన్ల కింద అనేక బస్తీలు వెలిశాయి. ఇంటిపై చేతికి అందేంత ఎత్తులోనే వైర్లు కని్పస్తున్నాయి. ఈదురుగాలితో కూడిన వర్షాలకు చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడుతున్నాయి. ప్రజల ప్రాణాలను హరిస్తుండటంతో పాటు తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలకు కారణమవుతున్నాయి. ఇప్పటికే రాజేంద్రనగర్, రామంతాపూర్ సహా చెట్లు ఎక్కువగా ఉన్న చోట్ల ఎయిర్ బంచ్డ్ కేబుల్స్(ఏబీ)వేశారు. కొండాపూర్, గచి్చ»ౌలి, మేడ్చల్ సహా పలు ప్రాంతాల్లో సుమారు వెయ్యి కిలోమీటర్ల వరకు యూజీ కేబుల్స్ వేశారు. అయితే సమస్యాత్మకమైన కోర్‌సిటీలో మాత్రం ఇప్పటి వరకు ఈ పనులు చేయలేదు. ఇక్కడ ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు అత్యాధునిక ‘హారిజంటల్ డ్రిల్లింగ్’ పద్ధతిని ఎంచుకోవడమే ఉత్తమమని భావిస్తోంది. ప్రతి వంద నుంచి 200 మీటర్లకు ఒక రంధ్రాన్ని ఏర్పాటు చేసి, యూజీ కేబుల్‌ను సులభంగా వేయవచ్చని, ఇందుకు ప్రతి కిలోమీటర్‌కు రూ.13 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. అయితే కొండలు, గుట్టలు, చెరువులు, కుంటలు, ఎత్తైన చెట్లు ఉన్న ప్రాంతాల్లో యూజీ కేబుల్ వర్క్స్‌కు అవకాశం లేని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయంగా ఎయిర్ బంచ్డ్ కేబుల్స్‌ను అమర్చాలని భావిస్తోంది. విద్యుత్ సరఫరాలో ఇప్పటి వరకు ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని దశల వారీగా పనులు చేపట్టడం వల్ల వచ్చే ఐదేళ్లలో నగరం మొత్తం వైర్‌లెస్ సిటీగా మార్చొచ్చని యోచిస్తోంది.
50 నుంచి వందేళ్లు పని చేస్తుంది
యూజీ కేబుల్స్ పనులు హారిజంటల్ డ్రిల్లింగ్ విధానంలో చేపట్టాలని ప్రతిపాదించాం. భూమికి 1.2 మీటర్ల లోతు నుంచి 1.6 మీటర్ల లోతులో 4 నుంచి 8 ఇంచుల డయా మీటర్స్ రంద్రం ఏర్పాటు చేస్తారు. ప్రతి 100 మీటర్లకు ఒక రంద్రం ఏర్పాటు చేసి, డ్రిల్లింగ్ మిషన్‌కు ఉన్న బిట్టు సహాయంతో కేబుల్‌ను ఆ చివర నుంచి ఈ చివరి వరకు లాగుతుంటారు. ఈ తరహాలో ఇప్పటికే ముంబై, బెంగళూరు, ఢిల్లీలో కొత్త భాగం యూజీ కేబుల్ వేశారు. ఒక్కసారి కేబుల్ అమర్చితే..50 నుంచి వందేళ్ల వరకు ఇబ్బంది ఉండదు.
– శివాజీ, ప్రాజెక్టస్ డైరెక్టర్
లైన్‌లాస్, విద్యుత్ చౌర్యాన్ని అరికట్టొచ్చు
ఓహెచ్ లైన్ల స్థానంలో యూజీ కేబుల్స్ ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలతో పాటు చౌర్యం, విద్యుత్ నష్టాలను నియంత్రించే అవకాశం ఉంది. లైన్ల పునరుద్ధరణ పేరుతో ఏటా డిస్కం చేస్తున్న ఖర్చులు కూడా తగ్గిపోతాయి. యూజీ కేబుల్ ఏర్పాటు వల్ల భవిష్యత్తులో భారీ ఈదురు గాలులు వీచినా, చెట్ల కొమ్మలు విరిగిపడినా, వరదలు వచ్చినా సరఫరాలో సమస్య ఉండదు.
– డాక్టర్ నరసింహులు, ఆపరేషన్స్ డైరెక్టర్
డీపీఆర్ రెడీ అవుతోంది
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అంతరాయాలను నియంత్రించి, మెరుగైన విద్యుత్ సరఫరా కోసం ప్రస్తుతం ఉన్న లైన్ల స్థానంలో భూగర్భ విద్యుత్ కేబుళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. తరచూ తలెత్తుతున్న విద్యుత్ అంతరాయాలకు కారణాలను, ప్రమాదకరంగా మారిన విద్యుత్ లైన్లను గుర్తించి, ఇప్పటికే టీజీ ఎయిన్స్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేశాం. కనీసం 16 వేల కిలోమీటర్ల ఓహెచ్ లైన్ల స్థానంలో ఈ యూజీ కేబుల్స్ వేయాలని ప్రతిపాదించాం. ఇందుకు రూ.14 వేల కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అంచనా వేశాం. డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్)కూడా సిద్ధమవుతుంది. సాధ్యమైనంత త్వరలో ఈ పనులు చేపట్టి..హైదరాబాద్‌ను
వైర్‌లెస్ నగరంగా తీర్చిదిద్దుతాం.
– ముషారఫ్ ఫారూఖీ, సీఎండీ


