రెండు నెలల్లో పెళ్ళి..సరదాగా సాగర్‌ చూడ్డానికి వెళ్లి.. | Two Died In road accident at nagarjuna sagar | Sakshi
Sakshi News home page

రెండు నెలల్లో పెళ్ళి..సరదాగా సాగర్‌ చూడ్డానికి వెళ్లి..

Sep 19 2024 11:20 AM | Updated on Sep 19 2024 11:20 AM

Two Died In road accident at nagarjuna sagar

దయ్యాల గండి వద్ద కారును ఢీకొట్టిన సిమెంట్‌ లారీ

మహిళా కానిస్టేబుల్‌ దుర్మరణం

ఆమెకు కాబోయే జీవిత భాగస్వామికి గాయాలు

కేటీదొడ్డి/నాగార్జునసాగర్‌: సాగర్‌ను చూస్తానని వచ్చి ఓ మహిళా కానిస్టేబుల్‌ దుర్మరణం చెందగా, ఆమెకు కాబోయే జీవిత భాగస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లాలోని హైదరాబాద్‌–నాగార్జునసాగర్‌ హైవేపై దయ్యాల గండి వద్ద బుధవారం చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గద్వాల పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చేపల శ్రావణి(27)కి టాటాకంపెనీలో పనిచేస్తున్న మహబూబ్‌నగర్‌కు చెందిన జి.ప్రశాంత్‌తో ఇటీవలనే ఎంగేజ్‌మెంట్‌ అయింది. వీరికి నవంబర్‌లో వివాహం కావాల్సి ఉంది. ప్రశాంత్‌ కంపెనీ పనిమీద హాలియాకు రావాల్సి ఉండగా గద్వాల నుంచి ఇరువురు కారులో బయలుదేరారు. మార్గమధ్యలో శ్రావణి కోరిక మేరకు సాగర్‌ను సందర్శించి తిరిగి హాలియాకు వెళ్తున్నారు.

అప్పటికే రెండు కార్లు ఢీకొని..
ప్రశాంత్‌ కారు దయ్యాల గండి మూలమలుపు వద్దకు చేరుకోగానే అప్పటికే అక్కడ రెండు కార్లు ఒకదానికి ఒకటి స్వల్పంగా ఢీకొనడంతో ఆయా వాహనాల డ్రైవర్లు తగువుపడుతున్నారు. దీంతో హైవేకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ప్రశాంత్‌ కారు కూడా ప్రమాదం జరిగిన రెండు కార్ల వెనక నిలిచిపోయింది. ప్రశాంత్‌ కారు వెనుక కూడా మరో కారు ఉంది. ఈ క్రమంలోనే మాచర్ల నుంచి హైదరాబాద్‌కు సిమెంట్‌ లోడుతో వెళుతున్న లారీ అతివేగంగా వచ్చి తొలుత ప్రశాంత్‌ వెనుక ఉన్న కారును స్వల్పంగా ఢీకొట్టగా అది పక్కకు తొలగిపోయింది. అనంతరం లారీ ప్రశాంత్‌ కారును వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో లారీ ప్రశాంత్‌ కారుపైకి ఎక్కడంతో నుజ్జునుజ్జయ్యింది. అందులో చిక్కుకున్న ప్రశాంత్‌, శ్రావణిని పోలీసులు అరగంట పాటు శ్రమించి క్రేన్‌ సమాయంతో బయటకు తీశారు. అప్పటికే శ్రావణి మృతి చెందగా, ప్రశాంత్‌ గాయాలతో బయటపడ్డాడు. త్వరలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన మహిళను లారీ రూపంలో మృత్యువు కబళించడం చూపరులను కలచివేసింది. ఈ మేరకు సాగర్‌ సీఐ బీసన్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్వగ్రామంలో విషాదం
నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ శ్రావణి స్వగ్రామం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం యాపర్ల. ఆమె 2020లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. తొలుత వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తించారు. అనంతరం 2021లోని కేటీదొడ్డి పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. శ్రావణి రోడ్డు ప్రమాదంలో మరణించడం ఎంతో బాధాకరమని జోగుళాంబ గద్వాల ఎస్పీ టి.శ్రీనివాస్‌రావు తెలిపారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి ప్రకటించిన ఆయన వారికి అండగా ఉంటామని తెలిపారు. శ్రావణి మరణంతో యాపర్లలో విషాదం అలుముకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement