సీటు రానివారికి టెలీ కౌన్సెలింగ్‌ | Twenty Eight percent increase in mental disorders in country after covid | Sakshi
Sakshi News home page

సీటు రానివారికి టెలీ కౌన్సెలింగ్‌

Published Tue, Aug 15 2023 3:49 AM | Last Updated on Tue, Aug 15 2023 12:18 PM

 Twenty Eight percent increase in mental disorders in country after covid - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యూపీఎస్సీ, నీట్, జేఈఈ వంటి ప్రముఖ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో తక్కువ మార్కులొచ్చి ఎంబీబీఎస్, ఐఐటీ వంటి వాటిల్లో సీటు రాని వారికి మానసిక చికిత్స అందజేసేందుకు 24 గంటల టెలీ కౌన్సెలింగ్‌ను ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సిఫారసు చేసింది. ఆయా పరీక్షలు రాసి కొద్ది మార్కులతో సీట్లు కోల్పోతున్నవారు అనేకమంది ఉంటున్నారు.

వీరిలో కొందరు మానసిక కుంగుబాటుకు గురవుతున్నారు. కొందరు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘మానసిక ఆరోగ్యం.. వర్తమాన పరిస్థితుల్లో దాని నిర్వహణ’అనే అంశంపై పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఓ నివేదిక తయారు చేసి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు అందజేసింది. వివరాలిలా ఉన్నాయి.. 

ఆత్మహత్యలు 10 శాతానికి తగ్గాలి 
పాఠశాలల్లోనూ మానసికంగా కుంగిపోయే విద్యార్థుల కోసం కౌన్సిలర్లను నియమించాలి. ప్రస్తుతం జరుగుతున్న ఆత్మహత్యల సంఖ్యను 2030 నాటికి 10 శాతానికి తగ్గించాలి. కేంద్రీకృత సెంట్రల్‌ మెంటల్‌ హెల్త్‌ అథారిటీ, స్టేట్‌ మెంటల్‌ హెల్త్‌ అథారిటీలను ఏర్పాటు చేయాలి. జైళ్లల్లోనూ మెంటల్‌ హెల్త్‌ కౌన్సెలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. మానసిక ఆరోగ్య, సమస్యలను ఆరోగ్య బీమాలో చేర్చాలి. దేశంలో 47 మానసిక చికిత్సాలయాలున్నాయి. అయితే 2017లో ఏర్పాటైన మానసిక ఆరోగ్య చట్టానికి అనుగుణంగా అవి లేవు. ఆ మేరకు వాటిని తీర్చిదిద్దాలి.

ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ మెంటల్‌ హెల్త్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలి. మానసిక చికిత్సకు సంబంధించిన 17 రకాల మందులను ధరల నియంత్రణ పరిధిలోకి తీసుకొచ్చారు. అవన్నీ మెడికల్‌ కాలేజీలు, జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో ఉన్నాయి. వాటిల్లో కనీసం 13 మందులను ప్రాథమిక ఆసుపత్రి స్థాయికి తీసుకురావాలి. పోలియో చుక్కల ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకు సినీ తారలు, క్రీడాకారుల వంటి ప్రముఖులతో ప్రచారం చేస్తారు. అలాగే మానసిక సమస్యలకు సంబంధించి కూడా ఆయా రంగాల ప్రముఖులను బ్రాండ్‌ అంబాసిడర్లుగా నియమించి అవగాహన పెంచాలి.  

నివేదికలో మరికొన్ని ముఖ్యాంశాలు..

  • స్వయం ఉపాధి పొందుతున్నవారిలోనే ఎక్కువగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. తర్వాత వేతన జీవులు, నిరుద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, ప్రైవేట్‌ రంగం, రైతుల్లో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.  
  •  2021లో స్వయం ఉపాధికి చెందిన వారి లో 20,237 మంది ఆత్మహత్య చేసుకు న్నారు. వేతన జీవులు 15,870, నిరుద్యోగులు 13,714, విద్యార్థులు 13,089, వ్యా పారస్తులు 12,055, ప్రైవేట్‌రంగ ఉద్యోగులు 11,439, రైతులు 5,318, కూలీలు 5,563 మంది ఆత్మహత్య చేసుకున్నారు.  
  • కోవిడ్‌ తర్వాత మానసిక సమస్యలు 28% పెరిగాయి. 2017లో 1.29 లక్షల మంది ఆత్మహత్య చేసుకుంటే, 2021లో 1.64 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు.  
  • ఆల్కహాల్‌ వల్ల 4.7 శాతం మంది, పొగాకు వల్ల 20.9 శాతం మంది మానసిక సమస్యలకు గురవుతున్నారు. డిప్రెషన్, ఉద్వేగాలు, ఇతరత్రా కారణాలతో 10.9 శాతం మందికి సమస్యలు వస్తున్నాయి. తీవ్రమైన స్కిజోఫ్రేనియా వంటి సమస్యలతో 1.4 శాతం, యాంగ్జయిటీతో 3.2 శాతం, స్ట్రెస్‌తో 3.7 శాతం, ఇతరత్రా ఏదో ఒక మానసిక సమస్యతో 13.7 శాతం బాధపడుతున్నారు.  
  • దేశంలో లక్ష జనాభాకు 0.75 మంది మానసిక చికిత్స నిపుణులు ఉన్నారు. అంటే 1.34 లక్షల మంది జనాభాకు ఒక మానసిక చికిత్స నిపుణుడు మాత్రమే ఉన్నారు. ప్రపంచ సగటు 1.7గా ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో లక్షకు 8.6 మంది మానసిక నిపుణులు ఉన్నారు. .  
  •  ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతున్న బడ్జెట్లో రెండు శాతమే మానసిక ఆరోగ్యంపై ఖర్చు చేస్తున్నారు. దీన్ని 10 శాతానికి పెంచాలని ఆరోగ్య సంస్థ తెలిపింది. 
  • ఇక మానసిక రోగుల్లో 85 శాతం మందికి తగిన వైద్యం అందడం లేదు.  
  • మానసిక చికిత్సలను ఆయుర్వేద, యోగా పరిధిలోకి తీసుకురావాలి. జిల్లా కేంద్రంగా మానసిక వైద్యం ఉండాలి.  

మానసిక రోగుల్లో అవగాహన పెంచాలి 
జిల్లాకొక యువ స్పందన కార్యక్రమం పెట్టి 20 మందిని రిక్రూట్‌ చేసుకొని ప్రజల్లో మానసిక రోగాలపై అవగాహన పెంచాలి. బ్రిక్స్‌ దేశాల్లోని దక్షిణాఫ్రికాలో 35.8 శాతం మంది మానసిక సమస్యలున్నవారే. మన దేశంలో 30.1 శాతం మంది ఏదో ఒక మానసిక సమస్యలతో ఉన్నారు. 
– డాక్టర్‌ కిరణ్‌ మాదల,ఐఎంఏ, సైంటిఫిక్‌ కమిటీ కన్వీనర్‌ 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement