ఆగం కావొద్దు.. జాగ్రత్తగా ఓటెయ్యాలె! | Sakshi
Sakshi News home page

ఆగం కావొద్దు.. జాగ్రత్తగా ఓటెయ్యాలె!

Published Wed, Nov 29 2023 6:23 PM

TS Elections 2023: How To Vote Check Details Here - Sakshi

ఎన్నికలు.. ఓటు అనే వజ్రాయుధంతో సామాన్యుడు మాత్రమే పాల్గొనే నిశబ్ధ యుద్ధం.  ప్రజాస్వామ్య పరిరక్షణలో అర్హత లేని నేతల్ని ఓడించేందుకు.. అర్హత ఉంటే మళ్లీ ఎన్నుకునేందుకు అదికూడా ఐదేళ్లకొకసారి దొరికే అవకాశం ఎలక్షన్స్‌. అందుకే ఆ అవకాశం వదులుకోకుండా ఓటేసి బాధ్యత నెరవేర్చుకోవాల్సిన అవసరం ప్రతీ పౌరుడికీ ఉంటుంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసారి భారీగా కొత్త ఓటర్లు నమోదు అయ్యారు. అందులో 18 ఏళ్లు నిండి తొలిసారి ఓటేసేందుకు సిద్ధమైన వాళ్లు దాదాపు 10 లక్షలుకాగా.. మిగతా వాళ్లు మరో ఏడు లక్షలు ఉన్నారు. మరికొన్ని గంటల్లో పోలింగ్‌ కోసం సర్వం సిద్ధమైన వేళ.. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఈవీఎంలపై ఓటు ఎలా వేయాలి? సరైన ఓటు వేశామా? లేదా? అనేది ఎలా నిర్ధారించుకోవాలి.. ఒకవేళ పొరపాటు జరిగితే ఏం చేయాలి..  ఆ విషయాలన్నీ ఈ కథనంలో..    

ఓటు వేయడానికి వెళ్లేటప్పుడు.. పోలింగ్‌ కేంద్రాల వద్ద తప్పకుండా కొన్ని నిబంధనలు పాటించాలి. పార్టీల గుర్తులు, పార్టీలను ప్రతిబింబించే రంగుల దుస్తులు.. కండువాలు.. టోపీలు ధరించొద్దు. అలాగే పోలింగ్‌ కేంద్రానికి వెళ్లేటప్పుడు గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. ఓటేసేందుకు లోనికి వెళ్లాక.. బూత్ లోపలికి సెల్‌ఫోన్లు, ఇతర డివైజ్‌లు(పరికరాలు)  తీసుకెళ్లకూడదు. అలాగే.. అక్కడుండే భద్రతా సిబ్బందికి పూర్తిగా సహకరించాలి. 

ఓటు హక్కు ఉండి ఓటర్‌ కార్డు లేకున్నా.. కింద ఉన్నవాటిల్లో ఏదో ఒక కార్డుతో వెళ్లి ఓటేయొచ్చు

  • ఆధార్‌కార్డు
  • బ్యాంక్‌ పాస్‌బుక్‌
  • డ్రైవింగ్‌ లైసెన్స్‌
  • పాన్‌ కార్డు
  • పాస్‌పోర్ట్‌
  • పెన్షన్‌ కార్డు(ఫొటో తప్పనిసరి)
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసే సర్వీస్‌ ఐడీ కార్డులు

ఓటు వేసేందుకు లోపలికి వెళ్లినప్పుడు ముగ్గురు అధికారులు ఉంటారు. ఓటర్ లిస్ట్‌లో ఉన్న పేరు, గుర్తింపు కార్డు చూసి అధికారులు పోలింగ్ బూత్‌లోకి పంపుతారు. అక్కడ ఎడమచేతి చూపుడు వేలు చెక్ చేసి దానికి సిరా వేస్తారు. ఆ తర్వాత రిజిస్టర్‌లో ఓటరు వివరాలు నమోదు చేసి స్లిప్‌ రాసి ఓటు వేసేందుకు లోపలికి పంపిస్తారు. ఆ తర్వాతే ఓటరు.. పోల్‌ చీటీ తీసుకుని కంట్రోల్‌ యూనిట్‌ (సీయూ)లోపలికి వెళ్లి ఓటు వేయాలి.  అక్కడ ఈవీఎంలపై ఉన్న పార్టీ గుర్తును ప్రెస్‌ చేస్తే ఓటేసినట్లు లెక్క. 

ఇంతకీ మనం వేసిన ఓటు పడిందా? లేదా? పడితే మనం వేయాలనుకున్న అభ్యర్థికే పడిందా? ఎలా తెలుసుకోవడం.. ఇందుకోసమే  ఈవీఎంకు అనుసంధానంగా వీవీ ప్యాట్(ఓటర్‌ వెరిఫైడ్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌) ఉంటుంది. ఓటర్‌ ఈవీఎం బటన్ నొక్కిన తర్వాత..  ఓటేసిన గుర్తు అక్కడి తెరపై ఏడు సెకన్ల పాటు కనిపిస్తుంది. అలా ఓటుని నిర్ధారించుకోవచ్చు. ఆ తర్వాత బయటకు వచ్చేయడంతో ఓటింగ్‌ ప్రక్రియ పూర్తవుతుంది. ఒకవేళ ఓటేసే టైంలో.. సెల్ ఫోన్ లో చిత్రీకరించడం, దానిని బహిర్గతం చేయడం నిషేధం. దీనిని ఉల్లంఘిస్తే ఓటు రద్దుతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవు.

తొలిసారిగా 2013లో జరిగిన నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజక వర్గాల్లో వీవీ ప్యాట్ విధానాన్ని ఎన్నికల కమిషన్‌ అమలు చేసింది. ఆ తర్వాత దశలవారీగా వీవీ ప్యాట్ విధానాన్ని అమలు చేస్తూ వస్తోంది.  తెలంగాణలో వీవీ ప్యాట్‌ విధానం అమలు చేయడంతో ఇది రెండోసారి. 

ఫిర్యాదులు కూడా..
ఓటు వేయడంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైనా.. ఓటరు ఒకరికి ఓటు వేస్తే మరొక అభ్యర్ధికి ఓటేసినట్టుగా  రికార్డు అయినా.. బ్యాలెట్ పత్రంపై ఉన్న  అభ్యర్థి/ పార్టీ గుర్తును తప్పుగా చూపితే.. లేదంటే ఓటు ఒకరికి బదులు మరొకరు వేసినా.. వెంటనే పోలింగ్ కేంద్రంలో ఉండే ఆఫీసర్‌‌కు ఫిర్యాదు చేయొచ్చు. 
ఎన్నికల కమిషన్ రూల్స్  1961..  49 ఎంఏ  ప్రకారం ప్రిసైడింగ్ అధికారికి ఓటరు రాతపూర్వకంగా  ఫిర్యాదు చేయాలి. లేదంటే టోల్‌ఫ్రీ నెంబర్లు 1950, సీ-విజిల్‌ యాప్‌ లేదంటే ఎన్నికల సంఘానికి సంబంధించిన ఫిర్యాదుల విభాగానికి ఫిర్యాదు చేయొచ్చు. ఓటు విషయంలో నష్టం జరిగిందని భావిస్తే.. న్యాయస్థానాల్ని కూడా ఆశ్రయించొచ్చు. 

ఇలా జరుగుతుంది.. 
ఈ విషయమై  టెస్ట్ ఓటు వేసేందుకు ఓటరును అనుమతిస్తారు.  ఒకవేళ ఓటరు చెప్పేది తప్పుడు సమాచారమని తేలితే  దాని పరిణామాల గురించి  కూడా వివరిస్తారు.  ఓటరు చెప్పిన సమాచారం వాస్తవమని నిరూపించేందుకు  టెస్ట్ ఓటు నిర్వహిస్తారు.  ప్రిసైడింగ్ అధికారి, పోలింగ్ ఏజంట్ల సమక్షంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు.  ఓటరు  చెప్పినట్టుగా ఒక సింబల్ బటన్ నొక్కితే మరో సింబల్ గా రికార్డైతే  వెంటనే  రిటర్నింగ్ అధికారికి  ఈ సమాచారాన్ని సంబంధిత పోలింగ్ స్టేషన్ అధికారి నివేదిస్తారు. ఈ సమయంలో  పోలింగ్ ను నిలిపివేస్తారు. ఆపై రిటర్నింగ్ అధికారి  నిర్ణయం మేరకు  నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ఈ ఆరోపణ తప్పని తేలితే  ప్రిసైడింగ్ అధికారి  ఫారం  17 ఏలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement