దహెగాం(సిర్పూర్): ఏఐ యుగంలోనూ జిల్లాలోని మారుమూల గ్రామాలకు సరైన రవాణా సౌకర్యం లేక వైద్యానికి గిరిజనులు పడరాని పాట్లు పడుతున్నారు. వంతెన లేకపోవడంతో ఓ గర్భిణి ప్రయాణానికి ఎడ్లబండే దిక్కయింది. ఈ ఘటన దహెగాం మండలంలో చోటు చేసుకుంది. మురళీగూడకు చెందిన కుమురం వనితకు ఆదివారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. మురళీగూడ గ్రామానికి వెళ్లే దారిలో ఒర్రెపై వంతెన లేకపోవడంతో వాహనం అక్కడే ఆగిపోయింది. భర్త నాగేశ్ వనితను ఎడ్లబండిపై ఎక్కించుకుని ఒర్రె దాటించాడు.
అక్కడి నుంచి అంబులెన్సు ద్వారా దహెగాం పీహెచ్‌సీలో చేర్పించగా పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని.. కాస్త ఆలస్యమై ఉంటే రెండు నిండు ప్రాణాలు పోయేవని వైద్యసిబ్బంది చెబుతున్నారు. పెసరికుంట స్టేజీ నుంచి మురళీగూడ వరకు కిలోమీటరున్నర మట్టిరోడ్డు కావడంతో వర్షాకాలంలో వాహనాల రాకపోకలు సాధ్యం కాదు. వర్షాలు లేనందున వాహనాలు ఒర్రె వరకు వెళ్తున్నాయని స్థానికులు తెలిపారు. వంతెన నిర్మించి ప్రయాణ కష్టాలు తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.


