రామగుండం సీపీ ఎదుట లొంగిపోయిన ముగ్గురు దళసభ్యులు, ఐదుగురు మిలీషియా మెంబర్లు
వివరాలు వెల్లడించిన సీపీ అంబర్ కిశోర్ ఝా
ఛత్తీస్‌గఢ్ పోలీసులకు లొంగిపోయిన బాలక్క అలియాస్ పుష్ప
అచ్చంపేటలో ఇద్దరు మావోయిస్టుల అరెస్ట్
గోదావరిఖని/బెల్లంపల్లి/నాగర్‌కర్నూల్: మావోయిస్టు పార్టీకి చెందిన పలువురు దళసభ్యులు, మిలీషియా మెంబర్స్ శనివారం పోలీసుల వద్ద లొంగిపోయారు. వీరిలో మావోయిస్టు పార్టీ టెక్నికల్ టీమ్ సభ్యురాలు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన బాలక్క అలియాస్ జాడి పుష్ప కూడా ఉన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ అంబర్ కిశోర్ ఝా వివరాలు వెల్లడించారు.
మొత్తం 8 మంది లొంగిపోగా అందులో ముగ్గురు దళసభ్యులు, మిగతావారు మిలీషియా సభ్యులు ఉన్నారన్నారు. వీరికి తెలంగాణ ప్రభుత్వం ద్వారా పునరావాస పథకం వర్తింపజేస్తామని తెలిపారు. లొంగిపోయిన వారిలో మిలీషియా, కొరియర్, సాంస్కృతిక విభాగం, లోకల్ కమిటీ వంటి విభాగాల్లో క్రియాశీలకంగా పనిచేసినవారు ఉన్నారని, వీరు ప్రధానంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించారని పేర్కొన్నారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, సీఐలు రాజేంద్రప్రసాద్, భీమేశ్, ఆర్‌ఐ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
లొంగిపోయిన మావోయిస్టులు వీరే..
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం చెగ్యాల గ్రామానికి చెందిన ధర్మాజీ శ్రీకాంత్, దళసభ్యుడిగా పనిచేసిన ముడియం జోగ, ముడియం మంగు, పొడియం కాములు, మహిళా సభ్యురాలు కుంజం లక్కె, మోదం భీమ, కుంజం ఉంగా, ముడికం సుక్రం. వీరిలో శ్రీకాంత్ మినహా మిగిలిన వాళ్లందరూ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందినవారు.
అజ్ఞాతం వీడిన మావోయిస్టు పుష్ప
మావోయిస్టు పార్టీ టెక్నికల్ టీమ్ సభ్యురాలు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన మావోయిస్టు బాలక్క అలియాస్ జాడి పుష్ప అజ్ఞాతం వీడింది. శుక్రవారం ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం బీజాపూర్ పోలీసుల వద్ద ఆమె ఆయుధంతో సహా లొంగిపోయింది. ఆమె ఫొటో లు, వీడియో చూసిన తల్లి ఆవుల మల్లమ్మ, సోదరుడు గంగయ్య ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఆమె భర్త జాడి వెంకటి అలియాస్ బిమల్ గత ఏడాది సెపె్టంబర్ 12న ఎదురుకాల్పుల్లో మృతిచెందిన విషయం తెలిసిందే.
అచ్చంపేటలో ఇద్దరు మావోయిస్టుల అరెస్ట్
మావోయిస్టు పార్టీ కేంద్ర మిల్ట్రీ కమిటీ సభ్యుడు, దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు మీసాల సలోమాన్ అలియాస్ సంతోష్ తో పాటు ఆయన భార్య సన్‌బట్టిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపే టలో ఇద్దరు మావోయిస్టులతో పాటు మరో ము గ్గురు మావోయిస్టు సానుభూతిపరులను పోలీసు లు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అరెస్ట్ వివరాలను ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ అచ్చంపేటలో మీడియాకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ని పలనాడు జిల్లా బొల్లంపల్లి మండలం పామిడిపాడుకు చెందిన మీసాల సలోమాన్ అలియాస్ సంతోష్ అలియాస్ నాగరాజు దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా, మిలిటరీ ఇన్‌స్ట్రక్టర్‌గా, టీం కమాండర్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య సన్‌బట్టి మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ దండకారణ్యంలో డీవీసీఎం కేడర్‌లో పనిచేస్తున్నా రు.
వీరితో పాటు తెలంగాణ ప్రజాఫ్రంట్ కో కన్వీనర్, అమ్రాబాద్ మండలం వంకేశ్వరం గ్రామా నికి చెందిన ఎడ్ల అంబయ్యను అదుపులోకి తీసుకున్నారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, అమ్రాబాద్ మండలం మన్ననూర్‌కు చెందిన జక్క బాలయ్య, లింగాల మండలం క్యాంపు రాయవరానికి చెందిన మాజీ మావోయిస్టు మన్‌శెట్టి యాదయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు.


