ముగిసిన ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు

Mar 13 2026 8:56 AM | Updated on Mar 13 2026 8:56 AM

కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు ముగిశాయి. గురువారం జిల్లావ్యాప్తంగా 34 కేంద్రాల్లో మొదటి సంవత్సరం విద్యార్థులకు కెమిస్ట్రీ, కామర్స్‌ పరీక్షలు నిర్వహించగా.. 7,297 మందికి గాను 6,957 మంది పరీక్షకు హాజరయ్యారు. జనరల్‌ విభాగంలో 5,802 మందికి గాను 5,579 మంది, ఒకేషనల్‌లో 1,495 మందికి గాను 1,378 మంది హాజరై పరీక్ష రాశారు. జనరల్‌ విభాగంలో 223 మంది, ఒకేషనల్‌లో 117 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని డీఐఈఓ వెంకటరమణ తెలిపారు.

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు

కందనూలు: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టర్‌ అధ్యక్షతన ఆయన చాంబర్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఇసుక బుకింగ్‌ పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో ‘మన ఇసుక వాహనం’ యాప్‌ ద్వారానే జరగాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫ్‌లైన్‌ బుకింగ్‌ అనుమతించకూడదని స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా పారదర్శకత పెరిగి ప్రభుత్వానికి గరిష్ట ఆదాయం లభిస్తుందన్నారు. జిల్లాలోని వంగూరు మండలం జాజాల, ఉప్పునుంతల మండలంలోని దాసర్లపల్లి గ్రామాల్లో పట్టా భూమిలో ఇసుక తవ్వకాలపై వచ్చిన దరఖాస్తులను అధికారులు సమర్పించిన పర్యావరణ అనుమతుల ద్వారా ఇసుక రీచ్‌లను తెలంగాణ మినరల్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారానే ఇసుక తరలించేలా కలెక్టర్‌ అనుమతులు ఇచ్చారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ అమరేందర్‌, జిల్లా మైనింగ్‌ అధికారి వెంకటరమణ, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి మురళి, డీపీఓ శ్రీరాములు, భూగర్భజల శాఖ అధికారి దివ్య జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

కంటిచూపును

సంరక్షించుకోవాలి

నాగర్‌కర్నూల్‌ క్రైం: మానవ జీవిత కాలంపాటు ప్రతిఒక్కరూ కంటి చూపును వందశాతం సంరక్షించుకోవాలని నాగర్‌కర్నూల్‌ ఆప్తాలమిక్‌ అధికారి కొట్ర బాలాజీ అన్నారు. గ్లూకోమా నీటి కాసుల వ్యాధి వారోత్సవాల సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, ఎల్వీ ప్రసాద్‌ నేత్ర విజ్ఞాన శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లాకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆప్తాలమిక్‌ అధికారి మాట్లాడుతూ ప్రతిరోజు భోజనంలో విటమిన్‌ ఏ సంబంధిత ఆహారాన్ని ప్రతిఒక్కరు అధిక మొత్తంలో తీసుకోవాలని సూచించారు. ప్రతివ్యక్తి ఆరునెలలకు ఒకసారి తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకుని ఏవైనా సమస్యలు ఉంటే చికిత్స చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎల్వీ ప్రసాద్‌ తూడుకుర్తి ఆస్పత్రి పాలనాధికారి ప్రేమ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

వ్యాధి నిరోధక శక్తి

పెంపునకే టీకాలు

పాన్‌గల్‌: పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించేందుకు టీకాలు వేయించాలని జిల్లా పశువైద్యాధికారి డా. వెంకటేశ్వర్లు సూచించారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని పశువులకు టీకాలు వేశారు. అనంతరం మాట్లాడుతూ.. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో పశువులకు ఉచితంగా అందిస్తున్న గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు అందుబాటులో ఉండి తమ పశువులకు టీకాలు వేయించాలన్నారు. అదేవిధంగా మండలంలోని చింతకుంట, రాయినిపల్లిలో పశువైద్య సిబ్బంది టీకాలు వేశారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డా. సురేష్‌, చింతకుంట సర్పంచ్‌ కోట్ల రాములు, పశువైద్య సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement