బాలికలకు టీకా రక్షణ | - | Sakshi
Sakshi News home page

బాలికలకు టీకా రక్షణ

Mar 13 2026 8:56 AM | Updated on Mar 13 2026 8:56 AM

గర్భాశయ క్యాన్సర్‌ అరికట్టేందుకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌

తప్పనిసరిగా తీసుకునేలా..

నాగర్‌కర్నూల్‌ క్రైం: ప్రస్తుతం మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ సాధారణంగా మారింది. భారతదేశంలో మహిళలకు 40 ఏళ్ల తర్వాత గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ బారిన పడుతుండటంతో నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టడంతోపాటు క్యాన్సర్‌ను కట్టడి చేసేందుకు హెచ్‌పీవీ (హ్యుమన్‌ పాపిలోమా వైరస్‌) టీకాను అందించేందుకు నిర్ణయించింది. ఈ నెల 8న ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా హెచ్‌పీవీ వాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ ప్రారంభించారు. మహిళలకు వచ్చే క్యాన్సర్లలో సర్వైకల్‌ క్యాన్సర్‌ రెండోస్థానం ఆక్రమిస్తుండటంతో 14 సంవత్సరాల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ఇవ్వడం వల్ల మహిళలకు భవిష్యత్‌లో కలిగే అస్వస్థలు, మరణాలను తగ్గించేందుకు వీలవుతుందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.

4,297 మంది బాలికలు..

జిల్లాలోని 14 సంవత్సరాల బాలికల వివరాలను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సేకరించారు. ఈ మేరకు జిల్లాలోని 28 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కలిపి 14 సంవత్సరాల బాలికలు 4,297 మంది ఉన్నట్లు గుర్తించడంతోపాటు ఒక డోసు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను వేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఈ నెల 8న జిల్లాకేంద్రంలోని జనరల్‌ ఆస్పత్రితోపాటు కల్వకుర్తి, అమ్రాబాద్‌, ఉప్పునుంతల, లింగాల సివిల్‌ ఆస్పత్రులు, కొల్లాపూర్‌, అచ్చంపేట ఏరియా ఆస్పత్రుల్లో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కలిపి 148 మంది బాలికలకు వ్యాక్సిన్‌ పంపిణీ చేశారు. అయితే టీకా కోసం వచ్చే బాలికలు తప్పనిసరిగా ఆధార్‌కార్డుతోపాటు జనన ధ్రువప్రతం తీసుకురావాలని వైద్యులు సూచిస్తున్నారు.

సిబ్బందికి ప్రత్యేక శిక్షణ

జిల్లాలోని 14 ఏళ్ల బాలికలకు అందించే హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ గురించి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారితోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందికి ఇప్పటికే శిక్షణ అందించారు. జిల్లాలోని 28 పీహెచ్‌సీల పరిధిలో ఉన్న ఐస్‌లైన్‌ రిఫ్రిజరేటర్లను అధికారులు తరుచూ తనిఖీ చేస్తూ వ్యాక్సిన్‌ ఎంతెంత ఉష్ణోగ్రత్తల మద్య భద్రపర్చాలనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కావడంతో జిల్లా స్టోర్‌ నుంచి తరలించేందుకు అవసరమైన వ్యాక్సిన్‌ క్యారియర్లను, ఐస్‌ ప్యాక్‌లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

ఇప్పటికే జిల్లాలో 148 మంది

బాలికలకు పంపిణీ

జనరల్‌, ఏరియా, సివిల్‌ ఆస్పత్రుల్లో అందుబాటులో..

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ వల్ల వచ్చే దుష్ప్రభావాలపై జిల్లాలోని 14 ఏళ్ల బాలికలు, తల్లిదండ్రులకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పారంభమైతే 28 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నేరుగా వచ్చి వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచిస్తున్నారు. నాగర్‌కర్నూల్‌ను గర్భాశయ క్యాన్సర్‌ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా 14 ఏళ్ల వయస్సు గల బాలికలందరికీ హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ అందించేందుకు కృషి చేస్తామని వైద్యాధికారులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement