ఆషామాషీగా తీసుకోవద్దు | - | Sakshi
Sakshi News home page

ఆషామాషీగా తీసుకోవద్దు

Mar 13 2026 8:56 AM | Updated on Mar 13 2026 8:56 AM

99 రోజులు.. పది అంశాలు

‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’ నామమాత్రం కావొద్దు

అన్ని అంశాలపై ప్రత్యేకంగా

దృష్టిపెట్టాలి

పెండింగ్‌ పనులపై అధికారులే బాధ్యత వహించాలి

కార్యక్రమంపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో మంత్రి జూపల్లి కృష్ణారావు

సాక్షి, నాగర్‌కర్నూల్‌: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలో కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డితో కలిసి ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అధికారులు, సర్పంచులు, మున్సిపాలిటీల పాలకవర్గాల సభ్యులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు ఆషామాషీగా తీసుకోకుండా ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని చెప్పారు. కార్యక్రమం అమలులో రాష్ట్రంలోనే జిల్లాను ఆదర్శంగా నిలపాలని కోరారు. 99 రోజులపాటు ప్రధాన అంశాలపై నిర్వహించే ఈ కార్యక్రమాన్ని అన్ని విధాలుగా సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ప్రజలతో మమేకం కావాలి..

నూతనంగా ఎన్నికై న సర్పంచులు, మున్సిపాలిటీల చైర్మన్లు, కౌన్సిలర్లకు ఈ కార్యక్రమం మంచి అవకాశం అని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇంటింటికి వెళ్లి ప్రజాసమస్యలను తెలుసుకోవాలని, ప్రధానంగా సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం కృషిచేయాలన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటేనే మంచిపేరు ఉంటుందని, భవిష్యత్‌లో ఎదుగుదలకు ఉపకరిస్తుందని చెప్పారు. ప్రజాప్రతినిధులతోపాటు అధికారులు సైతం ప్రజలతో మమేకం కావాల్సిందేనన్నారు. తహసీల్దార్‌ స్థాయి అధికారులు సైతం ఉదయం పూట గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు.

దరఖాస్తులు స్వీకరించాలి..

99 రోజులపాటు నిర్వహించే ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో సమస్యల పరిష్కారంపైనే అధికారులు దృష్టిపెట్టాలన్నారు. ప్రజల నుంచి ప్రతి దరఖాస్తును స్వీకరించి.. రసీదు ఇవ్వాలని, పెండింగ్‌ పనులు ఉంటే అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. నిర్దేశిత గడువులోగా సమస్యలు పరిష్కారం కావాల్సిందేనని స్పష్టం చేశారు. భూభారతి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేకంగా శ్రద్ధవహించాలన్నారు. దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం, కాలయాపన ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రధాన సమస్యలకు నిధులు..

మున్సిపాలిటీలతోపాటు గ్రామాల్లో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, కనీస అవసరాలకు తప్పనిసరిగా నిధులు కేటాయించాలని మంత్రి చెప్పారు. ముందుగా పారిశుద్ధ్యం, లైటింగ్‌, తాగునీరు, డ్రెయినేజీ పనులు చేపట్టిన తర్వాత మిగతా వాటికి నిధుల కేటాయించాలన్నారు. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న మరణాల్లో సగభాగం ప్రమాదాలు, తాగినడపడం, ఓవర్‌స్పీడ్‌ ద్వారానే జరుగుతున్నాయని, దీనిపై గ్రామస్థాయిలో ఇంటింటా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. ప్రైవేట్‌లో చదువు పేరిట భారీగా అప్పులపాలవుతున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేలా ప్రోత్సహించాలని చెప్పారు. వివాహం జరిగిన వారం రోజుల్లో కల్యాణలక్ష్మి కింద ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేలా చూడాలని, ఆతర్వాత 20 రోజుల్లో మంజూరయ్యేలా అధికారులు అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్‌లాల్‌, అమరేందర్‌, డీఎఫ్‌ఓ రేవంత్‌చంద్ర, మున్సిపల్‌ చైర్మన్లు సునేంద్ర, రత్నమాల, రెడ్డి జ్యోతి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రమణారావు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఈ కార్యక్రమం కింద కీలకమైన 10 అంశాలను ఎంపిక చేసుకుని 99 రోజులపాటు అమలు చేసేలా పూర్తిస్థాయిలో ప్రజలను మమేకం చేయాలన్నారు. పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యం, సురక్షితంగా చేరుకోవడం, సంక్షేమం, పిల్లల భద్రత– రక్షణ, రైతులు, విద్య, యువత– క్రీడలు, మహిళలు, పర్యావరణం అంశాలు ఉన్నాయన్నారు. వీటిపై ఏప్రిల్‌ 2న గ్రామసభల నిర్వహణ, ఏప్రిల్‌ 16న మండల, మే 2న నియోజకవర్గ, మే 22న జిల్లా, జూన్‌ 2న రాష్ట్రస్థాయిలో ప్రగతి ప్రణాళిక సమావేశాలు నిర్వహించనున్నట్టు వివరించారు.

ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ నల్లమల ప్రాంతానికే చెందిన సీఎం రేవంత్‌రెడ్డికి ఇక్కడి ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టారన్నారు. అభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమస్యల పరిష్కారానికి కృషిచేయాలన్నారు.

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ కల్వకుర్తి పట్టణంలో అభివృద్ధి పనుల కోసం ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి రూ.15 కోట్లు కేటాయించారన్నారు. ప్రధానంగా సీసీరోడ్లు, మౌళిక వసతుల కల్పనకు కృషిచేస్తున్నామన్నారు.

ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వ కాలంలో ప్రతీఇంటికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పారు. నాగర్‌కర్నూల్‌ పట్టణ అభివృద్ధికి రూ.55 కోట్లతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement