షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం
డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులు క్షేమం
తిమ్మాపూర్/విద్యానగర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూర్ శివారులో రాజీవ్ రహదారిపై కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు షార్ట్‌సర్క్యూట్‌తో దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రాణాపాయం తప్పింది. కరీంనగర్–2 డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు (టీజీ 02టి1138) ఆదివారం ఉదయం 8 గంటలకు కరీంనగర్ బస్టాండ్ నుంచి ఇద్దరు చిన్నారులు సహా 40 మంది ప్రయాణికులతో బయల్దేరింది. ఉదయం 8.20 గంటలకు అల్గునూర్ శివారులోని కాకతీయ కాలువ దాటాక బ్యాటరీలో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ ప్రశాంత్ వెంటనే బస్సును రోడ్డు పక్క ఆపేశాడు.
బస్సు తలుపులు, ఎమర్జెన్సీ తలుపులు తెరిచి ప్రయాణికులను బయటకు పంపించాడు. బస్సులోని అగ్నిమాపక పరికరాలు ఉపయోగించి మంటలు ఆర్పేందుకు యత్నించాడు. మంటలు వేగంగా వ్యాపించడంతో అదుపు తప్పాయి. ఐదు నిమిషాల్లోనే బస్సు మొత్తం కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు.
ఘటనా స్థలాన్ని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.వెంకన్న, కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలమన్, కరీంనగర్ ఆర్‌ఎం బి.రాజు, రవాణాశాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్, డీటీసీ రవీందర్ పరిశీలించారు. డ్రైవర్ ప్రశాంత్ సమయస్ఫూర్తిని అభినందించి రూ.5 వేల ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. ఎల్‌ఎండీ సీఐ రమేశ్, ఎస్‌ఐ అన్వర్ ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు.


