
ఏర్పాట్లు పూర్తి చేసిన పంచాయతీరాజ్ శాఖ
మొదటిదశలో 7,449 కి.మీ. రోడ్ల నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హ్యామ్) ప్రాజెక్టులో భాగంగా పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధికి శుక్రవారం టెండర్ నోటిఫికేషన్ విడుదల కానుంది. మొదటిదశలో 17 ప్యాకేజీల కింద 96 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 2,162 రహదారులు (7,449.50 కిలోమీటర్ల పొడవుతో) నిర్మించనున్నారు. హ్యామ్ ప్రాజెక్టుల కోసం.. టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభమవుతాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు.
17 ప్యాకేజీలకు సంబంధించిన టెండర్ ప్రక్రియను ప్రారంభించేందుకు పీఆర్ ఈఎన్‌సీ జోగారెడ్డి ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారమే నోటీసు ద్వారా టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసి..టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభమయ్యేలా అవసరమైన చర్యలు చేపట్టినట్టు ఆయన తెలిపారు.
హ్యామ్ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ రహదారులు కొత్త దశలోకి ప్రవేశిస్తాయని, జాతీయ, అంతర్జాతీయ రహదారి నిర్మాణ సంస్థలు ఈ ప్రాజెక్టు టెండర్లలో పాల్గొనాలని సీతక్క కోరారు. ఈ ప్రాజెక్ట్ అమలుతో గ్రామీణ రహదారి సదుపాయాలు మరింత పటిష్టమై గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందన్నారు. ఈ విధానం ద్వారా గ్రామీణ రహదారుల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని, రవాణా సౌకర్యాలు విస్తృతంగా మెరుగుపడతాయని తెలిపారు.