
కోర్ అర్బన్ ఏరియాలో చకచకా ఏర్పాట్లు
కలెక్టరేట్లలో సమావేశమైన రివిజన్ కమిటీలు
38 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల పరిధిలో ప్రస్తుతానికి పెంపు
స్థానిక ఎన్నికల తర్వాతే గ్రామీణ ప్రాంతాల్లో సవరణ
ఈ నెల చివరలో లేదంటే సెప్టెంబర్ 1 నుంచి అమలు..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల విలువ సవరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. వీలైనంత త్వరగా భూముల ప్రభుత్వ విలువను సవరించే దిశలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తుది కసరత్తు ప్రారంభించింది. సవరణ ప్రక్రియకు ఇటీవల జరిగిన రెవెన్యూ శాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో రాష్ట్రంలోని కోర్ అర్బన్ రీజియన్‌లో భూముల విలువను సవరించే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ ద్వారా వారం రోజుల్లోపు పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు సిద్ధమవుతాయని, అనంతరం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అనుమతి తీసుకుని ఈ నెలాఖరులో లేదంటే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కోర్ అర్బన్ రీజియన్‌లో కొత్త విలువను అమల్లోకి తెస్తారని తెలుస్తోంది.
రాష్ట్రమంతా స్థానిక ఎన్నికల తర్వాతే..
భూముల సవరణ ప్రక్రియను ప్రస్తుతానికి కోర్ అర్బన్ ప్రాంతంలోనే అమలు చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన తర్వాత రాష్ట్రమంతా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఔటర్ రింగురోడ్డుకు అటు, ఇటుగా పట్టణీకరణ అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లోని 38 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో తుది కసరత్తును రిజిస్ట్రేషన్ల శాఖ ప్రారంభించింది. కోర్ అర్బన్ పరిధిలోనికి వచ్చే ప్రాంతాల్లో ప్రత్యేక సవరణ ప్రక్రియను చేపట్టేందుకు రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌గాంధీ హనుమంతు ఈ నెల 13న జీఓ నంబర్ 90 జారీ చేశారు.
ఓఆర్‌ఆర్‌కు ఇరువైపులా ఉన్న జీహెచ్‌ఎంసీ, కంటోన్మెంట్‌తో పాటు 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో సెంట్రల్ వాల్యుయేషన్ అడ్వైజరీ కమిటీ (సీవీఏసీ) సిఫారసు మేరకు తెలంగాణ మార్కెట్ విలువల సవరణ నిబంధనలు, 1998 ప్రకారం ఈ ప్రక్రియ అమలవుతుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ జీఓ మేరకు గతంలో భూముల విలువల సవరణ కోసం రూపొందించిన మార్గదర్శకాలతో డీఐజీలు, హైదరాబాద్, హైదరాబాద్ (సౌత్), రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని జిల్లా రిజి్రస్టార్లు, సబ్‌రిజిస్ట్రార్లకు ప్రత్యేక ఉత్తర్వులు కూడా పంపారు.
రివిజన్ కమిటీల భేటీ..
ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని అన్ని జిల్లాల్లో శుక్రవారం జిల్లా స్థాయి రివిజన్ కమిటీలు సమావేశమయ్యాయి. తాజా ఉత్తర్వుల ప్రకారం ఏ ప్రాంతంలో ఏ మేరకు వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలను పెంచాలనే ప్రతిపాదనలపై చర్చించాయి. గతంలోనే సబ్‌రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్ల స్థాయిలో రూపొందించిన ఈ సవరణ ప్రతిపాదనలను జిల్లా రివిజన్ కమిటీ చైర్మన్ హోదాలో ఆయా జిల్లాల కలెక్టర్లకు అందజేశారు. ఈ ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం కలెక్టర్లు తుది ప్రతిపాదనలను స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖకు సమర్పించనున్నారు. ఈ తుది ప్రతిపాదనలను కేబినెట్ ముందుంచి అనుమతి తీసుకున్న అనంతరం కొత్త విలువలు అమల్లోకి రానున్నాయి.