
గతేడాదితో పోలిస్తే తగ్గుదల నమోదు
16 శాతానికి చేరిన రికవరీ: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో
దేశవ్యాప్తంగా సైబర్ నేరాల నమోదు 28 శాతం పెరిగినట్లు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఆర్థిక సైబర్ నేరాల ఫిర్యాదులు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 11 శాతం తగ్గినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తెలిపింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా సైబర్ నేరాల ఫిర్యాదులు 28 శాతం పెరిగినట్లు ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. దీనిప్రకారం జనవరి–ఏప్రిల్ మధ్య సైబర్ నేరగాళ్ల చేతిలో డబ్బులు కోల్పోయే ఘటనలు 19 శాతం తగ్గినట్లు వివరించింది.
సైబర్ బాధితులు పోగొట్టుకున్న సొమ్ము రికవరీ 2024లో 13 శాతంగా నమోదవగా ఈ ఏడాది అది 16 శాతానికి పెరిగినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో తెలిపింది. గతేడాది ఇదే కాలంలో 6,763 కేసులు నమోదవగా ఈ ఏడాది 7,575 కేసులు నమోదైనట్లు పేర్కొంది. 2024లో 230 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశామని.. ఈ ఏడాదిలో 626 మంది నేరగాళ్లను పట్టుకున్నామని బ్యూరో వివరించింది. 1930 కాల్ సెంటర్‌కు ఫిర్యాదు అందిన వెంటనే 3 నిమిషాల్లోనే నగదు ఫ్రీజింగ్‌కు సంబంధించి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.