విద్యా ప్రమాణాలు పెంచుతున్నాం   | Sakshi
Sakshi News home page

విద్యా ప్రమాణాలు పెంచుతున్నాం  

Published Sun, Jul 17 2022 2:12 AM

Telangana Ministers KTR Inauguration Of Government Junior College Building In Dundigal - Sakshi

కుత్బుల్లాపూర్‌/సుభాష్‌నగర్‌: ప్రభుత్వ రంగంలో గత 8 ఏళ్లుగా విద్యా ప్రమాణాలను పెంచుతూ వస్తున్నామని... పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. అంగన్‌వాడీ మొదలు యూనివర్సిటీ స్థాయి వరకు విద్యా వ్యవస్థలో గుణాత్మక మార్పులు తెచ్చామని చెప్పారు. శనివారం ఆయన హైదరాబాద్‌ కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని దుండిగల్, బహుదూర్‌పల్లిలలో రూ. 2.5 కోట్ల వ్యయంతో నిర్మించిన జూనియర్‌ కాలేజీని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజులతో కలసి ప్రారంభించారు.

వొకేషనల్‌ కాలేజీకి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన విద్య అందించేందుకు సీఎం కేసీఆర్‌ కల్పించిన వసతులను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనుల భేరిలో పాల్గొనేందుకు వెళ్లే సమయంలో ఇదే జూనియర్‌ కాలేజీ శిథిలావస్థలో ఉండేదని, ప్రస్తుతం కొత్త భవనం నిర్మించి వొకేషనల్‌ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. 

గురుకుల విద్యార్థులు ఐఐటీలకు... 
ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 973 గురుకుల పాఠశాలల్లో 5 లక్షల మంది విద్యార్థులకు రూ. 1.20 లక్షల చొప్పున ఖర్చు చేస్తోందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నాణ్యమైన విద్యతోపాటు ఇంట్లో కూడా అందని సకల సౌకర్యాలు అందిస్తోందని చెప్పారు. ప్రభుత్వం అందించే నాణ్యమైన చదువుతో వెయ్యి మందికంటే ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఐఐటీకి వెళ్లారని... ఇది ప్రభుత్వం చదువుకు ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తోందన్నారు.

400 గురుకుల పాఠశాలలను 1,052 గురుకులాలను కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ చేశామని.. ఇది ఎంతో గర్వకారణమన్నారు. విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.18 వేల కోట్లు చెల్లించామని, విదేశాల్లో చదువుకోవాలనుకునే ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షలు అందిస్తున్నామని కేటీఆర్‌ వివరించారు. జిల్లాకో మెడికల్‌ కాలేజీ చొప్పున 33 మెడికల్‌ కాలేజీలు మంజూరయ్యాయని... అగ్రికల్చర్, లా కాలేజీలు, 79 డిగ్రీ కాలేజీలు, రెండు యూనివర్సిటీలను మంజూరు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

స్థానిక ఎమ్మెల్యే వివేకానంద కోరిన మేరకు ఉర్దూ కాలేజీని మంజూరు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబిత, మల్లారెడ్డి ప్రసంగించగా ఎమ్మెల్సీలు శంభీపూర్‌ రాజు, నవీన్, సురభి వాణీదేవి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పాల్గొన్నారు. 

Advertisement
Advertisement