
సిద్దిపేట, సాక్షి: పెహల్గాంలో 28 మంది అమాయక పౌరుల ప్రాణాలు తీసి పాకిస్తాన్‌లో నక్కిన ఉగ్రమూకలను ఏరివేయడమే లక్ష్యంగా భారత్ సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం కావడంపై దేశవ్యాప్తంగా జయజయధ్వానాలు మోరుమోగుతున్నాయి. అమాయకులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పారంటూ ప్రశంసిస్తున్నారు. దీనిపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించారు.
సిద్దిపేట జిల్లా కోహెడ గ్రామంలో 41 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ చెక్కులను పంపిణి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం ఆపరేషన్ సిందూర్ విజయవంతంపై హర్షం వ్యక్తం చేస్తూ భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఉగ్రవాద స్థావరాలపై చేసిన దాడి ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంపై గట్టి చప్పట్లతో అభినందనలు తెలుపుతున్నానన్నారు.
రాజకీయాలు, పార్టీలకతీతంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు పూర్తి మద్దతు తెలుపుతున్నామన్న పొన్నం.. ‘కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో పాటు, అన్ని పార్టీల నాయకులు ఈ చర్యను సమర్థిస్తున్నాయి. ఉగ్రవాదుల చర్యలకు బుద్ధి చెప్పే విధంగా సైనిక చర్యలు ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. దేశ సమగ్రతకు పాటుపడుతున్న సైనిక చర్యలకు మద్దతు ఇస్తున్నాం. భారత సైనికులకు శుభాకాంక్షలు, అభినందనలు’ అని పేర్కొన్నారు.