సీఎం సీటుకు వెలకట్టిన పార్టీ మీది

Telangana: Minister Harish Rao Fires On BJP Party - Sakshi

బీజేపీపై మంత్రి హరీశ్‌రావు మండిపాటు

సాక్షిప్రతినిధి, వరంగల్‌/భూపాలపల్లి: ‘కర్ణాటకలో సీఎం సీటు కావాలంటే అధిష్టానానికి రూ.2,500 కోట్లు ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యేనే అన్నడు.. సీఎం సీటుకు వెలకట్టే పార్టీ బీజేపీ అయితే, ఓటుకు కోట్లు నిందితుడు ఉన్న పార్టీ కాంగ్రెస్‌’ అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆయన సోమవారం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటించారు.

మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌తో కలసి ఆయన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి, ఆయుష్‌ ఆస్పత్రి భవన పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. బీజేపీ అధ్యక్షుడు నడ్డా కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరానికీ నీరు పారలేదని చెప్పడం విడ్డూరమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ గతిని మార్చేసిందని నాలుగు రోజుల క్రితం రాష్ట్రానికి వచ్చిన కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కితాబు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.  

త్వరలో 13వేల డాక్టర్‌ పోస్టుల భర్తీ 
రాష్ట్రంలో త్వరలోనే 13 వేల డాక్టర్‌ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. హనుమకొండ కలెక్టరేట్‌లో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి కలెక్టర్లు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వాస్పత్రుల్లో నార్మల్‌ డెలివరీలను ప్రోత్సహించేందుకు ప్రతి డెలివరీకి రూ.3వేల ప్రోత్సాహకం అందిస్తామని తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top