ఇంటర్‌ విద్యార్థులకు రెండు చాన్సులు

Telangana Inter Exams Will Be Likely In July - Sakshi

జూలైలో మొదటి పరీక్షలు.. ఆగస్టులో ఫలితాలు

అప్పుడు రాయలేకపోయినవారికి మరో అవకాశం

రాష్ట్రంలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలపై కేంద్రానికి నివేదిక

ప్రాక్టికల్‌ పరీక్షలు వాయిదా

పరీక్షలకు 15 రోజుల ముందు చెబుతామని బోర్డు వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంటరీ్మడియట్‌ ద్వితీయ సంవత్సర పరీక్షలు రాసే విద్యార్థులకు రెండు అవకాశాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పరీక్షలను రెండుసార్లు నిర్వహించనుంది. మొదటి పరీక్షలను జూలైలో నిర్వహించి ఆగస్టులో ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించినట్లు కేంద్రానికి తెలిపింది. ఇటీవల కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ అన్ని రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు, కార్యదర్శులతో పరీక్షల నిర్వహణపై వర్చువల్‌ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాల అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలియజేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యా శాఖ సంయుక్త కార్యదర్శి ఎల్‌ఎస్‌ చాంగ్సన్‌కు రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా కేంద్రానికి లేఖ రాశారు.

పరీక్షలను జూలై మధ్యలో నిర్వహిస్తామని అందులో పేర్కొన్నారు. ప్రశ్నపత్రాలు ఇప్పటికే ముద్రించినందున పరీక్ష విధానంలో ఎలాంటి మార్పులు చేయడం లేదని వెల్లడించారు. అయితే ప్రశ్నపత్రంలో ఇచి్చన మొత్తం ప్రశ్నల్లో 50 శాతం ప్రశ్నలకే సమాధానాలు రాసేలా విద్యార్థులకు అవకాశం ఇస్తామన్నారు. ఆ మార్కులను రెట్టింపు చేసి 100 శాతంగా పరిగణనలోకి తీసుకుని ఫలితాలు వెల్లడిస్తామని వివరించారు. పరీక్ష సమయాన్ని 3 గంటల నుంచి 90 నిమిషాలకు కుదిస్తున్నట్లు వెల్లడించారు. రెండు వేరు వేరు సెట్ల ప్రశ్నపత్రాలతో ఉదయం, సాయంత్రం రెండు బ్యాచ్‌లుగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు కరోనా, ఇతరత్రా కారణాలతో ఈ పరీక్షలకు హాజరు కాలేని విద్యార్థులకు మూడో సెట్‌ ప్రశ్నపత్రంతో తర్వాత పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వీలైనంత మేర భౌతిక దూరాన్ని పాటిస్తూ పరీక్షల నిర్వహణకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కాగా, ఇంటర్‌ ద్వితీయ సంవత్సర ఫలితాలు జూలైలో నిర్వహిస్తారని.. పరీక్షల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయని ‘సాక్షి’గురువారం కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే.

ప్రాక్టికల్‌ పరీక్షలు వాయిదా.. 
ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలకు సంబంధించి ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 29 నుంచి వచ్చే నెల 7వ  తేదీ వరకు నిర్వహించాల్సిన ప్రాక్టికల్‌ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ తెలిపారు. కరోనా నేపథ్యంలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సర, ఒకేషనల్‌ ప్రథమ సంవత్సర పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిపై జూన్‌ మొదటి వారంలో సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రాక్టికల్‌ పరీక్షల నిర్వహణ తేదీలను కనీసం 15 రోజుల ముందు చెబుతామని వివరించారు.  

చదవండి: డబుల్‌ హ్యాపీ.. కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
చదవండి: తక్షణమే ‘కోవిడ్‌’ కారుణ్య నియామకాలు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top