
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1 మెయిన్స్ విషయంలో టీజీపీఎస్సీకి (TGPSC) తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ర్యాంకులను రద్దు చేస్తూ.. మెయిన్స్ పేపర్లను మళ్లీ దిద్దాలన్న సింగిల్ బెంచ్ తీర్పును బుధవారం డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. దీంతో గ్రూప్-1 నియామకాలకు లైన్ క్లియర్ అయ్యింది.
గ్రూప్-1 ర్యాంకర్లకు ఊరట ఇస్తూ నియామకాలు జరుపుకోవచ్చని.. అయితే ఆ నియామకాలు తుది తీర్పునకు లోబడే ఉండాలని రిక్రూట్‌మెంట్ బోర్డుకు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. టీజీపీఎస్సీ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై తదుపరి విచారణను వచ్చే నెలకి వాయిదా వేసింది.
గ్రూప్-1 మెయిన్స్(Group 1 Exam) ర్యాంకింగ్‌లో అవకతవకలు జరిగాయన్న అభ్యంతరాల నడుమ దాఖలైన పిటిషన్లను విచారించిన తెలంగాణ హైకోర్టు.. ఆ ర్యాంకులను రద్దు చేస్తూ ఈ నెల 9వ తేదీన సంచలన తీర్పు ఇచ్చింది. తిరిగి రీవాల్యూయేషన్ నిర్వహించాలని, కుదరకుంటే రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటూ రిక్రూట్‌మెంట్ బోర్డుకు 8 నెలల గడువు విధించింది. ఈ తీర్పుతో ర్యాంకర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా.. మరోవైపు టీజీపీఎస్సీ హైకోర్టును ఆశ్రయించింది.
ఈ రిట్ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. సింగిల్ బెంచ్ తీర్పును అసంబద్ధంగా అడ్వొకేట్ జనరల్ వాదించారు. 14 ఏళ్ల తర్వాత గ్రూప్-1 నిర్వహించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పారదర్శకంగా పరీక్ష నిర్వహించింది. గ్రూప్-1 నిర్వహణ రూల్స్‌లో.. రీవాల్యూయేషన్ అనేది లేదు. కేవలం రీకౌంటింగ్ మాత్రమే ఉంది. కాబట్టి ఈ తీర్పు సహేతుకం కాదు అని డివిజన్ బెంచ్(Telangana High Court Division Bench) దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న డివిజన్ బెంచ్.. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధిస్తూ నియమకాలు జరుపుకోవచ్చని క్లియరెన్స్ ఇచ్చింది.
ఇదీ చదవండి: కాళేశ్వరంతో నాకేం సంబంధం లేదు-స్మితా సబర్వాల్