ఉస్మానియా ఆస్పత్రి అంశంపై హైకోర్టులో విచారణ

Telangana High Court Hearing On Osmania Hospital Issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఉస్మానియా ఆస్పత్రికి సంబంధించి అనేక మంది ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌)దాఖలు చేశారని, వాటన్నింటిని కలిపి విచారిస్తామని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. కొన్ని వ్యాజ్యాలు పురావస్తు భవనం కూల్చివేయొద్దని, మరికొన్ని కూల్చివేసి కొత్త ఆస్పత్రి భవనం నిర్మించాలని కోరుతున్నాయని వాటిని విభజించి విచారించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. సోమవారం హైకోర్టులో ఉస్మానియా ఆస్పత్రి అంశంపై విచారించారు. ఈ సందర్భంగా అడ్వకేట్‌ జనరల్‌ మాట్లాడుతూ.. ఉస్మానియా ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చెరుకుందని, రోగులు, డాక్టర్లు, సిబ్బందికి ప్రాణాపాయం ఉందని కోర్టుకు వివరించారు.  (చదవండి: ఆ విషయంలో జోక్యం చేసుకోలేం : హైకోర్టు)

పురావస్తు భవనాన్ని కూల్చకుండా 26 ఎకరాల స్థలంలో కొత్త భవనాలను నిర్మించవచ్చని ఓ పిటిషర్‌ తరపు న్యాయవాది రచనారెడ్డి కోర్టులో ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని వ్యతిరేకించిన మరో కౌన్సిల్‌ సందీప్‌రెడ్డి.. ఎవరుపడితే వారు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసి కోర్టు సమయం వృధా చేస్తున్నారని బెంచ్‌కు తెలిపారు. వర్షాలకు ఆస్పత్రి భవనంలోకి చేరిన నీటి గురించి మీడియా వార్తలు, కథనాలను చూశామని చీఫ్ జస్టిస్ అన్నారు. ఉస్మానియా అస్పత్రి అంశంపై దాఖలైన వ్యాజ్యాలలో కొన్ని పురావస్తు భవనం కూల్చివేయొద్దని, మరికొన్ని కూల్చివేసి కొత్త ఆస్పత్రి భవనం నిర్మించాలని కోరుతున్నాయని, వాటిని విభజించి విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆగస్ట్‌ 24కు వాయిదా వేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top