వరద సహాయక చర్యలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు

Cannot Interfere With Flood Relief Operations Telangana High Court Says - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వరద సహాయక చర్యల్లో జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, వరద సహాయక చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ చేసిన అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. వరద సహాయక చర్యల్లో హైకోర్టు జోక్యం అవసరం లేదని అభిప్రాయపడింది.

ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలను చేపట్టిందని, హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాలను అప్రమత్తం చేసింది కదా అని ప్రశ్నించింది. వరద ప్రాంతాలకు ప్రభుత్వం హెలికాఫ్టర్లను కూడా సిద్దం చేసిందని గుర్తు చేసింది. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఊహించి జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. వరద పరిస్థితులపై ప్రభుత్వానికి స్పష్టత ఉందని హైకోర్టు పేర్కొంది. 
(చదవండి : ప్రమాదకరంగా హుస్సేన్‌సాగర్‌ నాలా..)

అప్రమత్తమైన పోలీసుశాఖ
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పోలీసుశాఖ అప్రమత్తమైంది.  వర్షాల వల్ల ఏ విధమైన ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లకుండా అప్రత్తంగా ఉండాలని రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమీషనరేట్లు, జిల్లా ఎస్పీలను డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల పోలీసు అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు డీజీపీ కార్యాలయం నుండి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. జిల్లాలలో ఉన్న పరిస్థితులను సమీక్షించి ఎప్పుటికప్పుడు సమాచారం అందించాలని ఎస్పీలకు డీజీపీ ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలను సురక్షితంగా తరలించాలన్నారు. వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల్లో కురుస్తున్నభారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పోలీసులకు డీజీపీ మహేందర్‌ రెడ్డి సూచించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top