లోతట్టు ప్రాంతాల్లో భయం భయం

Hussain Sagar Nala Flood Water Flow Danger Bells GHMC - Sakshi

ముషీరాబాద్‌: హుస్సేన్‌సాగర్‌ నాలాకు వరద పోటెత్తుతోంది. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాలకు పైనుంచి వరదనీరు వచ్చిచేరడంతో హుస్సేన్‌సాగర్‌ నిండుకుండలా మారింది. దీంతో ప్రస్తుతం హుస్సేన్‌సాగర్‌ నీటిమట్టం 513 అడుగులకు చేరుకుంది. ట్యాంక్‌బండ్‌కు ఇరువైపులా ఉన్న మారియెట్‌ హోటల్, జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి నీరు దిగువకు గతంలో కంటే అధికంగా హుస్సేన్‌సాగర్‌ నాలాకు వచ్చిచేరుతోంది. దీంతో ప్రవాహ ఉధృతి పెరిగింది. సోమవారం కూడా ఇలాగే వర్షం కురిస్తే ప్రవాహ ఉధృతి మరింత పెరిగి ఇళ్లల్లోకి వరదనీరు వచ్చి చేరుతుందని హుస్సేన్‌సాగర్‌ నాలా లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (సిటీ పోలీసు హై అలర్ట్‌!)

ముఖ్యంగా  ఎరుకల బస్తీ, బీఎస్‌ నగర్, మారుతీనగర్, అరుంధతీ నగర్, సబర్మతినగర్, బాపూనగర్, అశోక్‌నగర్, లంకబస్తీ, మున్సిపల్‌ క్వార్టర్స్, దోభీగల్లీ తదితర ప్రాంతాలలో నివసించే పేద ప్రజలకు వరద పొంచి ముప్పు ఉంది. కాగా హుస్సేన్‌సాగర్‌ నాలాకు ఇరువైపులా రిటైనింగ్‌వాల్‌ నిర్మిస్తామని ప్రతి ఎన్నికల సందర్భంగా రాజకీయ నాయకులు హామీలు ఇస్తున్నారే కానీ గెలిచిన తరువాత దాని ఊసే ఎత్తడంలేదు. ఇక గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం అధికారులను, ప్రజాప్రతినిధులను అప్రమత్తంగా ఉండాలని, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని, సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించినా ముషీరాబాద్‌ మండలాధికారులు మాత్రం స్పందించిన దాఖలాలులేవు.  

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ 
హుస్సేన్‌సాగర్‌ నాలా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఆదివారం ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ నాలా పరివాహక ప్రాంతాలు గోశాల, అరుంధతినగర్, లింక్‌బ్రిడ్జ్, వైశ్రాయ్‌హోటల్‌ పరివాహక ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నాలా పరివాహక ప్రాంత బస్తీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు నీటి ప్రవాహాన్ని పరిశీలించి ప్రజలకు తగు సూచనలు అందించాలని ఆదేశించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top