గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష విషయంలో నెలకొన్న ఉత్కంఠ కొనసాగనుంది. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు ఇవాళ తీర్పు ఇవ్వాల్సి ఉండగా.. అది కాస్త వాయిదా పడింది. ఈ తీర్పుతో అప్పాయింట్‌మెంట్ లెటర్లు అందుకున్న అభ్యర్థుల భవితవ్యం తేలాల్సి ఉండేది. అయితే..
గత నెలలోనే సంబంధిత పిటిషన్లపై తీర్పు రిజర్వ్ చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్ ధర్మాసనం.. తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది. అయితే ఇవాళ్టి తీర్పును ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. తీర్పు ఇంకా రెడీ కాలేదని డివిజన్ బెంచ్ వెల్లడించింది.
2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ పరీక్షకు సంబంధించిన పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట్ శివనగర్‌కు చెందిన కె.పరుశరాములుతోపాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ జడ్జి.. మార్చి 10న వెలువరించిన తుది మార్కుల జాబితా, మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేశారు. అలాగే..
గ్రూప్–1 మెయిన్స్ అన్ని సమాధాన పత్రాలను తిరిగి మూల్యాంకనం చేసి ఫలితాలను ప్రకటించాలని కమిషన్‌ను ఆదేశించారు. ఇది సాధ్యంకాని పక్షంలో మెయిన్స్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని చెప్పారు. అయితే ఈ జడ్జి ఆదేశాలను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీతో పాటు పలువురు సెలక్ట్ అయిన అభ్యర్థులు వేసిన పిటిషన్లను సీజే ధర్మాసనం విచారణ జరిపి తీర్పు వాయిదా వేసింది. తీర్పుతో 563 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఇప్పటికే వీళ్లు అప్పాయింట్‌మెంట్ లెటర్లు అందుకున్న సంగతి తెలిసిందే.
వాదనలు ఇలా..
టీజీపీఎస్సీ తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. నిబంధనల ప్రకారం పారదర్శకంగా పరీక్షలు జరిగాయన్నారు. మూల్యాంకనంలో అవకతవకలు జరగకూడదన్న లక్ష్యంతో ఇద్దరి చేత చేయించారని తెలిపారు. పరీక్ష కేంద్రాల పెంపు, పరిపాలనాపరమైన సౌలభ్యం కోసం ప్రిలిమ్స్‌కు, మెయిన్స్‌కు హాల్‌టికెట్లను వేర్వేరుగా జారీ చేసిందని చెప్పారు. పరీక్షల్లో కాపీయింగ్ జరిగిందని ఎలాంటి ఆరోపణలు లేవని వెల్లడించారు.
అర్హత సాధించిన అభ్యర్థుల తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పరీక్షల్లో అర్హత సాధించలేనివారు కోర్టును ఆశ్రయించారన్నారు. రెండు హాల్‌టికెట్లు ఉంటాయని పరీక్షలకు ముందే వెల్లడించినా అప్పుడు అభ్యంతరం చెప్పకుండా, ఫలితాలు విడుదలయ్యాక పిటిషన్ వేయడం చెల్లదన్నారు.
తీర్పు.. ఇవాళ వెలువడాల్సిన తీర్పు ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా పడింది.


