యూరియా ఉన్నా.. రైతుకు సున్నా! | Telangana has 3. 91 lakh urea in stock | Sakshi
Sakshi News home page

యూరియా ఉన్నా.. రైతుకు సున్నా!

Jun 24 2026 5:29 AM | Updated on Jun 24 2026 5:29 AM

Telangana has 3. 91 lakh urea in stock

రాష్ట్రంలో మొత్తం 3.91 లక్షల మెట్రిక్‌ టన్నుల నిల్వలు

మార్క్‌ఫెడ్‌ గోదాముల్లోనే 60 శాతం వరకు స్టాక్‌ 

ప్యాక్స్‌లు, సహకార సంఘాలకు అందని వైనం 

కొత్త పాలక మండళ్లపై అయోమయమే కారణం 

ఇండెంట్లు పెట్టడంపై పాత మండళ్ల అనాసక్తి 

వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోవాలంటున్న రైతులు

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో యూరియా కొరత లేదని ప్రభుత్వం ప్రకటిస్తున్నా, నాలుగు లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా యూరియా నిల్వలున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు యూరియా దొరకడం లేదు. దాదాపు 60 శాతానికి పైగా నిల్వలు మార్క్‌ఫెడ్‌ గోదాముల్లోనే మూలుగుతున్నా..రైతులకు వీటిని సరఫరా చేసే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (ప్యాక్స్‌లు), సహకార సంఘాలకు యూరి యా రావడం లేదు. దీంతో రైతులు ఎరువుల కోసం దుకాణాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఒకవైపు కేంద్రం నుంచి రావాల్సిన ఎరువులు పూర్తిస్థాయిలో రాలేదు. మరోవైపు వచి్చన నిల్వలు రైతులకు  అందడం లేదు. ముఖ్యంగా ప్యాక్స్‌ల పాలకమండళ్ల తీరుతో యూరియా రైతులకు చేరడం లేదు. 

పుష్కలంగా ఉన్నా..‘అందని ద్రాక్ష’ 
    రాష్ట్రంలో ఈనెల 22 నాటికి 3.91 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అందులో 2.56 లక్షల టన్నుల యూరియా మార్క్‌ఫెడ్‌ గోదాముల్లోనే ఉంది. రైతులకు నేరుగా అందుబాటులో ఉండే డీలర్ల వద్ద 94 వేల టన్నులు, సహకార సంఘాల వద్ద 25 వేల టన్నులు ఉండగా, ఆయా ఎరువుల కంపెనీల గోడౌన్‌లలో మరో 16 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా ఉంది. ఈ విధంగా ప్రభుత్వ లెక్కల్లో మాత్రమే యూరియా పుష్కలంగా ఉంది. కానీ అది రైతులకు మాత్రం అందని ద్రాక్షగా మారింది. కేంద్ర ప్రభుత్వం కేటాయించే యూరియా రైల్వే ర్యాక్‌ల ద్వారా రాష్ట్రానికి చేరిన వెంటనే అందులోని 60 శాతం యూరియాను మార్క్‌ఫెడ్‌ గోదాములకు తరలిస్తారు. మిగతా 40 శాతం వ్యవసాయ శాఖ ద్వారా ప్రైవేటు వ్యాపారులకు పంపించడం జరుగుతుంది. 

ప్రైవేటు దుకాణాలను చూపిస్తున్న యాప్‌ 
    ప్రతి ఖరీఫ్‌ సీజన్‌లో ప్యాక్స్‌లు, సహకార సంఘాలు ఇండెంట్‌ పెడితే మార్క్‌ఫెడ్‌ యూరియా సరఫరా చేస్తుంది. ఇందుకోసం ఆయా సహకార సంఘాలు ఇండెంట్‌ ఇవ్వాలి. అయితే ప్రస్తుతం ప్యాక్స్‌కు కొత్త పాలక మండళ్ల విషయంలో అయోమయం నెలకొంది, కొత్తగా సంఘాలు ఏర్పాటయ్యేంత వరకు పాత పాలక మండళ్లనే కొనసాగించాలని హైకోర్టు తీర్పు చెప్పినా యూరియా ఇండెంట్లపై పాలకమండళ్లు దృష్టి పెట్టడం లేదు.

ప్యాక్స్‌ సీఈవోలు కూడా యూరియా బాధలు తమకెందుకులే అనే ధోరణిలో ఉన్నారు. ఈ కారణంగానే ప్యాక్స్‌కు యూరియా తగినంత వెళ్లడం లేదు. కేవలం 25 వేల మెట్రిక్‌ టన్నులు (5.64 లక్షల బస్తాలు) మాత్రమే సహకార సంఘాల వద్ద ఉండగా.. మార్క్‌ఫెడ్‌ గోదాముల్లో 56.74 లక్షల బస్తాల (2.56లక్షల మెట్రిక్‌ టన్నులు) నిల్వలు ఉన్నాయి. మార్క్‌ఫెడ్‌ గోదాముల నుంచి జిల్లాలకు, అక్కడి నుంచి ప్యాక్స్‌ కేంద్రాలకు సరఫరా జరగకపోవడంతో రైతులు యాప్‌లో యూరియాను బుక్‌ చేయగానే దగ్గర్లోని ప్రైవేట్‌ దుకాణాలను చూపెడుతోంది. 

జూలైలో డిమాండ్‌ భారీగా పెరిగే చాన్స్‌ 
    డీలర్లకు కూడా పరిమిత సరఫరా కారణంగా యూరియా కోసం పోటీ నెలకొంది. యాప్‌ ఓపెన్‌ చేసినప్పుడు స్టాక్‌ ఉన్నట్లు చూపించి, కొద్ది నిమిషాల్లోనే నోస్టాక్‌ అని చూపిస్తున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్‌ ఎరువుల వ్యాపారులు సైతం తమకు అవసరమైన మేర స్టాక్‌ అందడం లేదని చెబుతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే నాలుగో వంతు కూడా ఈసారి సాగు కాలేదు.

పత్తి పంట కేవలం ఐదున్నర లక్షల ఎకరాల్లోనే సాగు జరగగా, వరి కేవలం 11వేల ఎకరాల్లోనే సాగైంది. కానీ యూరియా కోసం మాత్రం గత సంవత్సరంతో పోటీ పడి మరీ కొనుగోలు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ లెక్కలు చెపుతున్నాయి. పంటల సాగు లేకపోయినా, భవిష్యత్తులో యూరియా దొరుకుతుందో లేదో అనే భయంతో రైతులు ముందుస్తుగానే కొనుగోలు చేస్తున్నారని వ్యవసాయ శాఖ చెబుతోంది.

అయితే వరి ధాన్యం, మొక్కజొన్న, పత్తి సాగు గరిష్ట స్థాయికి చేరే జూలైలో యూరియా అవసరం భారీగా పెరగనుంది. మార్క్‌ఫెడ్‌ గోదాముల్లో ఉన్న నిల్వలను వెంటనే జిల్లాలకు తరలించి, ప్యాక్స్‌లు, సహకార సంఘాల ద్వారా రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోకపోతే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement