
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నం. 9 జారీ
వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం కల్పించేలా చారిత్రక నిర్ణయం
రాజ్యాంగ నిబంధనల మేరకు రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు వెల్లడి
బీసీల సమగ్ర అభివృద్ధి సాధనే లక్ష్యమన్న ప్రభుత్వం
ఉత్తర్వులకు అనుగుణంగా చర్యలకు పీఆర్, మున్సిపల్ శాఖలకు ఆదేశం
బీసీ రిజర్వేషన్ల నిర్ధారణ కోసం గత ఏడాది డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన సర్కారు
అసెంబ్లీ, మండలిలో బీసీ వర్గాల బిల్లుకు ఆమోదం
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాష్ శుక్రవారం జీఓ ఎంఎస్ నంబర్ 9 జారీ చేశారు. రాజ్యాంగ నిబంధనల మేరకు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ రిజర్వేషన్ల ద్వారా బీసీల సమగ్ర అభివృద్ధి సాధించవచ్చనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ ఉత్తర్వులకు లోబడి రాష్ట్ర పంచాయతీరాజ్, పురపాలక శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
రాజ్యాంగం కల్పించిన అధికారాలతో..
ప్రజా ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడిన రాష్ట్ర ప్రభుత్వం..భారత రాజ్యాంగం నిర్దేశించిన సమానత్వం, సామాజిక న్యాయాన్ని అందించాలనే సంకల్పంతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న వెనుకబడిన వర్గాల అవసరాలు తీర్చడంతో పాటు వారి సమాన అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రత్యేక చొరవ తీసుకుంది.
రాజ్యాంగంలోని ఆరి్టకల్ 40.. స్వయం ప్రతిపత్తి గల సంస్థలైన గ్రామ పంచాయతీలు స్వతంత్రంగా పనిచేసేందుకు అవసరమైన అధికారాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని స్పష్టం చేస్తోంది. అంతేకాకుండా ఆర్టికల్ 243 ఈ(6) ద్వారా గ్రామ పంచాయతీల చైర్‌పర్సన్ పదవుల్లో వెనుకబడిన తరగతులకు సీట్ల కేటాయింపు కల్పించే అవకాశం ఉంది. అదేవిధంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 టి(6) ద్వారా పురపాలక సంస్థల అధ్యక్ష పదవుల్లో బీసీ వర్గాలకు సీట్ల కేటాయింపు కల్పించే అధికారం ఉంది.
రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ బీసీ కమిషన్
భారత రాజ్యాంగం నిబంధనలకు లోబడి రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల నిర్ధారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో విశ్రాంత ఐఏఎస్ అధికారి బూసాని వెంకటేశ్వరరావు అధ్యక్షతన డెడికేటెడ్ బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. స్థానిక సంస్థల్లో బీసీల స్థితిగతులపై ఈ కమిషన్ సామాజిక పరిశోధనతో పాటు లోతైన అధ్యయనం చేసింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కుల సర్వే సైతం నిర్వహించాలని శాసనసభ, శాసనమండలిలో నిర్ణయం తీసుకుంది. ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సర్వే.. రాష్ట్రంలో వివిధ కులాల ఆర్థిక, సామాజిM్చý , విద్య, ఉపాధి, రాజకీయ స్థితిగతులను వెల్లడించింది.
సిఫారసులకు సర్కారు ఆమోదం
డెడికేటెడ్ బీసీ కమిషన్ ఈ ఏడాది మార్చిలో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుపై పలు సిఫారసులు చేస్తూ ఈ ఏడాది ఆగస్టులో నివేదిక సమరి్పంచింది. రాష్ట్రంలో బీసీల జనాభా 56.33% ఉందని, ఈ జనాభా వెనుకబడి ఉండడం వల్ల వారికి స్థానిక సంస్థల్లో 42 శాతం వరకు రిజర్వేషన్లు ఇవ్వవచ్చని సిఫారసు చేసింది. ఈ సిఫారసును అత్యంత జాగ్రత్తగా పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం..బీసీల రాజకీయ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందని నిర్ణయించింది. సిఫారసులకు ఆమోదం తెలిపింది.
గతంలో ఈ రిజర్వేషన్లు పలు విధాలుగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు రాష్ట్ర శాసనసభ, శాసనమండలిలో తెలంగాణ వెనుకబడిన వర్గాల బిల్లు–2025 (గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు) ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లును స్వాగతించాయి. ఈ నేపథ్యంలో మొత్తంగా.. రాజ్యాంగం కల్పించిన అధికారాలను వినియోగించుకుని, చట్టసభల అనుమతితో న్యాయ నిర్ణయాలకు లోబడి స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం సీట్లు, పదవుల రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయిస్తూ జీవో నంబర్ 9 జారీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.