హెచ్‌ఆర్‌ఏ తగ్గిస్తే..తగ్గనున్న వేతనాలు | Sakshi
Sakshi News home page

హెచ్‌ఆర్‌ఏ తగ్గిస్తే..తగ్గనున్న వేతనాలు

Published Tue, Mar 23 2021 5:35 AM

Telangana Government PRC Report Released - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు అమలు చేయనున్న పీఆర్‌సీలో ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ) తగ్గిస్తూ వేతన సవరణ సంఘం సిఫారసు చేసిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న హెచ్‌ఆర్‌ఏను యథాతథంగా కొనసాగించాలని కోరుతున్నాయి. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటివరకు హెచ్‌ఆర్‌ఏ 30 శాతం ఉండగా దాన్ని 24 శాతానికి తగ్గిస్తూ పీఆర్‌సీ సిఫారసు చేసింది. అలాగే 2 లక్షల జనాభా కంటే ఎక్కువున్న పట్టణాలు, మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో 20 శాతం హెచ్‌ఆర్‌ఏ ఉంటే దాన్ని 17 శాతానికి తగ్గించింది. ఇక 50 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో 14.5 శాతం హెచ్‌ఆర్‌ఏ ఉండగా దాన్ని 13 శాతానికి, మండల కేంద్రాలు, గ్రామాల్లో 12 శాతం హెచ్‌ఆర్‌ఏ ఉంటే దాన్ని 11 శాతానికి తగ్గించింది. దీంతో హెచ్‌ఆర్‌ఏ తగ్గింపు వల్ల తమకు చేకూరాల్సిన ప్రయోజనం రాకుండా పోతుందని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి.

అందుకే ప్రస్తుతం హెచ్‌ఆర్‌ఏను యథావిధిగా కొనసా గించాలని కోరుతున్నాయి. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిసింది. దానిపై ఉత్తర్వులు జారీ చేసే సమయంలో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, పాత పీఆర్సీలో హెచ్‌ఆర్‌ఏ గరిష్టంగా రూ. 15 వేల వరకే సీలింగ్‌ ఉంది. దీని ప్రకారం ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ ఒకవేళ రూ. 15 వేలకు మించినా రూ. 15 వేలే ఇస్తారు. కానీ ప్రస్తుత పీఆర్‌సీలో ఆ సీలింగ్‌ లేదు. అయితే రూ. 15 వేల కంటే తక్కువ హెచ్‌ఆర్‌ఏ ఉన్న వారికి మాత్రం హెచ్‌ఆర్‌ఏలో తగ్గుదల తప్పదు. 

Advertisement
Advertisement